సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన సరితా ఆవుల, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల నుండి కెమెరాలు గుంజుకొని, భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గం అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది.. ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్నారు.. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సమాజ హితాన్ని కాంక్షించే జర్నలిస్టుల పట్ల దాడులు పెరిగిపోతుండటం ఆందోళనకరం. జర్నలిస్టుల దాడుల పట్ల ప్రజాస్వామికవాదులు స్పందించాలి అని కోరారు.
దాడికి గురైన జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి.. వారి యోగక్షేమాలు, దాడి జరిగిన తీరును హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు.