mt_logo

పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు: హరీష్ రావు

పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారు.. రేవంత్ తెలంగాణ ఛాంపియన్‌ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారు. గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారు అని విమర్శించారు.

నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పుదోవ పట్టించారు.. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారు. ఈ అంశంపై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాం.. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తాం. నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారు అని దుయ్యబట్టారు.

పోతిరెడ్డిపాడుపై వైఎస్ హయాంలో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మాపై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డిపాడుపై జీఓ రాకముందే మేము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగాము. మేము రాజీనామా చేయడానికి పోతిరెడ్డిపాడు సహా అనేక అంశాలు కారణం అని తెలిపారు.

పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి.. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు అని ఎద్దేవా చేశారు.

రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జారిగాయి. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుంది..కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా.. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చింది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదు.. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబుతోనే ఉండే వారు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై దాడికి రైఫిల్‌తో బయలుదేరారు.. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్‌ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే.. కేసీఆర్ పుణ్యమే అని స్పష్టం చేశారు.

ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు ఇపుడేం చేస్తున్నారు.. కోమటిరెడ్డి, భట్టి, ఉత్తమ్ ఎల్ఆర్ఎస్‌ను ఫీజులు లేకుండా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు. అన్నీ ద్వంద్వ ప్రమాణాలే అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పని అయిపోయింది అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్‌కు గతంలో దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు.. అయినా ఆ పార్టి పని అయిపోయిందా. రెండుసార్లు కాంగ్రెస్‌ను మేమే ఓడించాం.. కాంగ్రెస్ పని అయిపోయిందా. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు.. కాంగ్రెస్ పని అయిపోయిందా? ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడ్డది.. కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99 అని ఫైర్ అయ్యారు.

జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణవాది తాను చిన్న తెలంగాణవాది అని రేవంత్ మాట్లాడుతున్నారు.. జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీనైనా ఒప్పించారా.. కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారు. తెలంగాణ వస్తుంది అనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు అని గుర్తు చేశారు.

రేవంత్ ఇప్పటికే మూడుసార్లు అబద్ధపు అంశాలతో సభను తప్పుదోవ పట్టించారు.. మీడియా కూడా రేవంత్ అబద్దాలను ఎండగట్టాలి. రుణమాఫీపై రేవంత్‌ది గోబెల్స్ ప్రచారం. 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవుతుందని రూ. 25 వేల కోట్లే బడ్జెట్‌లో పెట్టారు అని హరీష్ అన్నారు.