సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. సర్పంచులకు రూ. 690 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి సీతక్క గారు చెప్పార. ఈరోజు రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదు అని విమర్శించారు.
ఏడాది కాలం నుండి రూ. 690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటున్నది. గవర్నర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు అని దుయ్యబట్టారు.
కేసీఆర్ గారు పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు. పల్లె ప్రగతికి ప్రతి నెల రూ. 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 150 కోట్లు ఇచ్చాము. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20కి గాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయి. తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్‌ది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్ఎఫ్‌సీ నిధులు విడుదల కావడం లేదు, 15వ ఫైనాన్స్ కమీషన్ బిల్లులు డైవర్ట్ చేశారు. జీపీ ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారు అని ఆరోపించారు.
సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారు. నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు రూ. 1,200 కోట్లు విడుదల చేశారు. చిన్న పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల రోగాలు పెరిగాయి. తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది, వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి. ఇది దేశానికి, తెలంగాణకు అవమానంసర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 9 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు. అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
అనంతరం సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వనందున సభ నుండి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.