mt_logo

మూసీ పునరుజ్జీవనం అని రేవంత్ అద్దాల ఏఐ బిల్డింగులు చూపించిండు: హరీష్ రావు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి గారు చెప్పిన్రు. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్క్ టైం స్క్వేర్‌ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్‌ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్‌లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జీని మించిన బ్రిడ్జీలు చూపెట్టిండు అని ఎద్దేవా చేశారు.

ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్ని ఒక్క దగ్గర వేసి దంచి నూరి ఏఐలో వేసి తీసినట్టున్న పంచవన్నెల దృశ్యాలను చూపించాడు. నది పునరుజ్జీవనం అంటే సజీవంగా, గలగలపారే స్వచ్ఛమైన జలాలు, సుందరీకరణ అంటే మీరు చూయించిన హైటెక్కులు, అద్దాల ఏఐ బిల్డింగులు అని విమర్శించారు.

అద్దాల బిల్డింగులు ఉండవంటూనే ఎన్నెన్నో అందాలను చూయించారు. ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల కన్సార్షియం చూపించింది కరెక్టా? మీ ప్రజెంటేషన్‌లో రివర్ రెజునెవేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది. రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనం. మరి ఈ ఫ్రంట్ ఏంది. దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంది? అని ప్రశ్నించారు.

నీ యాక్టివిటీ కన్‌స్ట్రక్షన్ దగ్గర మొదలు కాలేదు, డిస్ట్రక్షన్ దగ్గర మొదలు పెట్టినవు. నిర్మాణం దగ్గర మొదలు కాలేదు, విధ్వంసం దగ్గర మొదలు పెట్టినవు అని దుయ్యబట్టారు.

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్.. పోదాం పదా.. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం అని సవాల్ విసిరారు.

సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆశాలు, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంతకుముందు నువ్వున్న తెలుగుదేశం పార్టీది అని హరీష్ రావు ధ్వజమెత్తారు. మీకు దమ్ముంటే మేము మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి అని పేర్కొన్నారు.

ఆక్రమణలు చేస్తున్నది పేద ప్రజలు కాదు, నువ్వే అక్రమంగా పేదల భూములు ఆక్రమణలు చేస్తున్నావ్. ఫోర్త్ సిటీ ఎక్కడ పెడుతున్నావ్.. రియల్ ఎస్టేట్ చేస్తున్నావ్.. ఎందుకు బ్లఫ్ చేస్తున్నావ్ అని మండిపడ్డారు.

నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్.. రాజకీయాలు చేస్తున్నావ్. నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నల్లగొండ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభించు అని అన్నారు.

మూసీ పునరుజ్జీవనానికి మేం వ్యతిరేకం కాదు. నీ బుల్డోజర్ విధానాలకు, మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేం వ్యతిరేకం. నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా సరే బాధితులైన ప్రజల పక్షాన నిలబడుతం. నీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తం అని స్పష్టం చేశారు.