నిధులు విడుదల చేయకపోవడంతో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలానికి చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులు సామూహికంగా సెలవులు పెట్టే దుస్థితి రావడం దురదృష్టకరం అని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ కార్యదర్శుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని అన్నారు.
9 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం కుంటుపడింది.. మురికి కూపాలుగా మారడం వల్ల మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి అని దుయ్యబట్టారు. చివరకు ట్రాక్టర్ డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది అని వాపోయారు.
గ్రామపంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిధులు విడుదల చేయాలని మేము కోరితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా ఉండటం లేదు అని హరీష్ రావు విమర్శించారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, చేసిన పనులకు గాను మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.