mt_logo

జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిన రేవంత్: హరీష్ రావు

రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని.. ఓపెన్ కోటాలో రిజర్వ్‌డ్ వారికి ప్రవేశం లేకుండా చేయడం అన్యాయం అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. మెరిట్ సాధించిన స్టూడెంట్స్‌కి ఓపెన్ కోటాలో కాకుండా, రిజర్వ్‌డ్ కోటాలో అవకాశం కల్పిస్తున్నారు. దీని వల్ల రిజ్వరేషన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఓపెన్ కోటా ఓపెన్ టూ ఆల్ అనే విషయాన్ని మర్చిపోయారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నడు అని విమర్శించారు.

రాహుల్ గాంధీ గారు రాజ్యంగం భగవద్గీత అన్నారు. మరి అది ఎందుకు ఇక్కడ అమలు కావడం లేదు..కేసీఆర్ గారు రాజ్యాంగం ప్రకారం, జీవో 55 ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చారు.. భర్తీ చేసారు. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది అని దుయ్యబట్టారు.

భట్టి విక్రమార్క గారు ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఇదే అంశాన్ని అడిగితే భట్టి గారు పరిశీలిస్తామన్నారు.. చేసిందేం లేదు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతినిధులు రేవంత్ రెడ్డిని నిలదీయండి అని పిలుపునిచ్చారు.

ఆయా వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ముందుకు రండి. యూపీపీఎస్సీ అమలు చేస్తుంది కానీ, టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచింది. ఓపెన్ కోటాలో రిజర్వుడు వారికి ప్రవేశం లేకుండా చేయడం అన్యాయం అని అన్నారు.

అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు. విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్ నగర్ ప్రాంతం మార్మోగుతున్నది. ఆ విద్యార్థులు కిరాతకులా, హంతకులా, గూండాలా.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో వచ్చి చదువుతున్నారు. రాజ్యంగ స్ఫూర్తిని కాపాడండి, రిజర్వేషన్లు అమలు చేయండి అని వారు రోడ్డెక్కితే విద్యార్థులు వీపులు పగుల కొడుతున్నారు..పొత్తి కడుపులో పిడిగుద్దులు గుద్ది, ఆడపిల్లల్ని కూడా ఆర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. కఠినంగా, కర్షకంగా వ్యవహరిస్తున్నారు.. దీన్నీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అని అన్నారు.

ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి హామీలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద ఎందుకు స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు అణిచివేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు మాట్లాడరా? అని అడిగారు.

పేద పిల్లలు జిల్లాల నుంచి వచ్చి ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని, 5 రూపాయలు అన్నం తింటూ చదువుకుంటారు. ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలని చదువుతున్నరు. అలాంటి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటైనా అమలు చేశారా.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు. పది నెలలు పూర్తయ్యింది.. ఇంకో నెల పది రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేస్తున్నం. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

కేసీఆర్ గారు పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఎగబెట్టావు, ఇప్పుడు జీవో తెచ్చి విద్యార్థులను మోసం చేసావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేస్తా అని మాట తప్పావు అని ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలు రాని వారికి పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నవు.. యువత జీవితాలను ఆడుకుంటున్నది రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోకుండా వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. విద్యార్థులపై దాడి చేయడం కాదు, ఆ విద్యార్థులను పిలిచి మాట్లాడండి అని కోరారు.

ఓట్లప్పుడు కాదు ఇప్పుడు వెళ్లండి రేవంత్ రెడ్డి గారు, అశోక్ నగర్ వెళ్లి లైబ్రరీలో కూర్చొని సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేస్తున్నాం..సెక్యూరిటీ లేకుండా వెళ్లే దమ్ముందా రేవంత్ రెడ్డి.. ఎందుకు మాట్లాడవు. కేసులు పెట్టినా, విద్యార్థుల మీద లాఠీలు లేస్తే, బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. అణిచివేతలతో ఏం చేయలేవు, ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అని హెచ్చరించారు.

కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారు.. నిరుద్యోగుల ఎజెండా నా ఎజెండా అన్నారు.. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయింది
కోదండరాం, రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళీ ఎక్కడున్నారు. అశోక్ నగర్ వెళ్లండి విద్యార్థులతో చర్చించండి. నిరుద్యోగులకు మోసం చేసి, ఉద్యోగాలు పొంది ఒక్క మాట్లాడటం లేదు అని దుయ్యబట్టారు.

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది రేవంత్ సర్కార్.. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి..ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని తుమ్మల గారు చావు కబురు చల్లగా చెప్పారు అని విమర్శించారు.

రూ. 15 వేలు అని చెప్పి ఉన్న పదివేలు ఇవ్వడం లేదు.. చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. రుణమాఫీ, బోనస్, ఇప్పుడు రైతుబంధు మోసం.. రైతులు తిరగబడుతారు..కరోనా వంటి ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ గారు రైతుబంధు ఆపలేదు అని గుర్తు చేశారు.

రూ. లక్షా 50 వేల కోట్లు మూసీకి ఉంటాయి, కానీ రైతులకు 15 వేలు ఇవ్వలేవా..ప్రభుత్వాన్ని వదిలేది లేదు.. కేసీఆర్ నాయకత్వంలో రైతుల తరుపున పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని ప్రజలకు, రైతులకు హరీష్ పిలుపునిచ్చారు.