mt_logo

వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు: హరీష్ రావు

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనారోగ్యం పాలై.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరామర్శించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్‌లో ఉంచి వారికి చికిత్స అందించారు. నాలుగు రోజులు గడించింది. అయినా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థిని లీలావతిని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్‌పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నది. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నది అని అన్నారు.

వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రాష్ట్రవ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.

గురుకులల్లో ఫుడ్ పాయిజనింగ్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతున్నదని ప్రాణాలను బలిగొంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. విద్యా మంత్రి, ఎస్సీ, ఎస్టీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం. చూడడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటారు. సబితా ఇంద్రా రెడ్డి గారిని, సత్యవతి గారిని అరెస్టు చేశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తుపై లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

నిన్న నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు.. ఆసుపత్రి పాలయ్యాడు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు నిత్యకృత్యం అవుతున్న ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు లేదు పలుకు లేదు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు. మేము ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటున్నారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచారు స్వాగతిస్తున్నాము గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి అని సూచించారు.

ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులకు సకాలంలో చికిత్స అందించకపోవడం వారి ప్రాణాల మీదకు వస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణాలు బలిగొంటున్నాయి. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని అడిగారు.

ఇప్పటికైనా కళ్లు తెరవండి ప్రచారం కోసం కాదు పిల్లల భవిషత్తు కోసం ఆలోచించండి. గురుకులాల యాత్ర పట్టారు.. ప్రతిపక్షం ఎత్తి చూపితే ఈరోజు వెళ్ళారు. చలికాలం వణుకుతున్నారు, వేడి నీళ్ళు లేవు, బట్టలు కూడా ఇవ్వలేదు, ఆ సమస్యలు పరిష్కరించండి. హాస్టల్‌లో పని చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. గ్రీన్ ఛానెల్ ఉంటే ఆరు నెలలుగా హాస్టళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదు. ఇప్పటి వరకు లీలావతికి ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. లీలావతి త్వరగా కోలుకోవాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులను అవసరం అయితే నిమ్స్ తరలించి మంచి వైద్యం అందించాలని కోరుతున్నాం అని అన్నారు.