mt_logo

కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన మొత్తం అప్పు రూ. 1,27,208 కోట్లు: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపై చేస్తున్న ప్రచారంపై అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా వాస్తవాలను మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. నేను 21 సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నాను. మంత్రిగా పనిచేశాను. ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ స్పీకర్ గారు ప్రశ్న చదివినప్పుడు మంత్రిగారు సీట్లో లేకపోయిన సందర్భం ఇదొక్కటే. సభలో ప్రశ్నోత్తరాలు ఉన్నప్పుడు భట్టి విక్రమార్క గారు సభలో లేకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51,277 కోట్లు అని చెప్పారు. ఈరోజు ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ. 55 వేల 277 కోట్ల ఎఫ్ఆర్బీఎం అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కార్పొరేషన్ లోన్లు, గ్యారెంటీలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన మొత్తం అప్పు లక్షా 27 వేల 208 కోట్లు రూపాయలు. అంటే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6 లక్షల 36,400 కోట్లు రూపాయలు అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫైనాన్స్ వైట్ పేపర్ ఆధారంగా చాలాసార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పు శ్వేత పత్రంలో రూ. 6,71,757 కోట్లు అన్నరు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు రూ.7 లక్షల కోట్లు అంటరు. ఈరోజు మీరు రూ. 7,11,911 కోట్ల అప్పు అంటరు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఐ చాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్ డిబేట్ పెట్టండి. ఆడిటర్లను, ఫైనాన్స్ నిపుణులను పిలిచి డిబేట్ పెట్టండి ఐ విల్ ప్రూవ్ అని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ కాలంలో చేసిన మొత్తం అప్పు రూ. 4,17,496 కోట్లు మాత్రమే. గతంలో భట్టి విక్రమార్క గారు ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులు అని తప్పుడు ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని హరీష్ రావు విమర్శించారు.

ఈ లెక్కలు ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు. ఆర్బీఐ కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు ఆర్థిక విషయాల్లో? రెండుసార్లు కరోనా రావడం దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం వల్ల రాష్ట్రాలు 1.75 శాతం అదనంగా అప్పులు తీసుకొని క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ చేయాలని కేంద్రం చెప్పడం వల్ల చేసిన అప్పులే. స్పీకర్ గారు మాకు మాత్రమే నీతులు చెప్తారు కానీ అధికార పార్టీకి ఎందుకు చెప్పరు? డివియేట్ కాకుండా మా పరిధిలో మాత్రమే మేము మాట్లాడుతున్నాము అని తెలిపారు.

సభ జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారు రూల్స్ గురించి మాట్లాడారు.. అసెంబ్లీ రూల్ బుక్ పేజీ నెంబర్ 86లో బీఏసీ కమిటీలో సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులను ప్రవేశపెట్టాలి. బీఏసీలో పెట్టకుండా రెండు బిల్లులను సభలో పెట్టారు అని మాత్రమే మేము అన్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో రూ. 1,27, 208 కోట్ల అప్పు చేసింది. రూ. 6 లక్షల 36 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న అయిదు ఏళ్లలో అప్పు చేయనుంది. భట్టి విక్రమార్క గారిపై ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో స్పీకర్ గారు క్లారిఫై చేయాలి. విక్రమార్క గారు మధిరలో మాట్లాడిన దానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర అప్పులపై గత అసెంబ్లీ సమావేశాల్లో తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని మేము ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాం అని అన్నారు.

వ్యవసాయ కూలీలకే కాదు, 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను భట్టి గారి సవాలు స్వీకరిస్తున్నాను. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టి గారిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి అని హరీష్ రావు కోరారు.