mt_logo

కాంగ్రెస్ అంటేనే ధోకా.. బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల విస్తరి: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలతోనే బడ్జెట్ ప్రసంగం నిండి ఉంది.. బడ్జెట్ ప్రసంగంలో ఆరోపణలు తప్పని బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయి అని అన్నారు.

మమ్మల్ని తిట్టుకుంటూ ఎంతకాలం బతుకుతారు.. ఈ ప్రభుత్వం దశ దిశ లేకుండా ఉంది. మీరు ఏం చేస్తారో చెప్పండి.. హామీల అమలెప్పుడో చెప్పండి 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల సంగతేమైంది అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చినం. గన్ పార్క్ దగ్గర రోడ్డు మీదికి వెళ్దాం నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రమ్మనండి.. మా పాలనలో కరెంట్ బాగుందా..ఇప్పుడు బాగుందా ప్రజల్ని అడుగుదాం అని సవాల్ విసిరారు.

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. మేం ఏం చేయకుండా రూ. 4.5 లక్షల కోట్లున్న జీఎస్డీపీ రూ. 14 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? కాంగ్రెస్ పాలనలో రూ.200 ఉన్న పెన్షన్ మేం రూ.2016కు పెంచినం. కాంగ్రెస్ చెప్పిన రూ.4 వేల పింఛన్ నాలుకల మీదనే ఉంది అని దుయ్యబట్టారు.

బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల విస్తరి.. కేంద్రం నుంచి రూ.26 వేల కోట్లు వస్తుందని బడ్జెట్లో పెట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తీర్మానం పెట్టారు. గత ఏడాది కేంద్రం నుంచి వచ్చిన నిధులు చాలా తక్కువ అని పేర్కొన్నారు.

పదేళ్ల మా పాలన విజయాలను ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టలేరు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం రూ.4 వేల కోట్లు ఎక్కువ వస్తుందన్నారు.. 8 నెలలుగా రిజిస్ట్రేషన్లు తగ్గుతుంటే ఆదాయం ఎలా పెరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఫీజులు, భూముల విలువలు పెంచి ప్రజలపై భారం వేస్తారా? మీరు తలదించుకోవడం తప్ప తలెత్తుకునే పరిస్థితి ఉండదు అని విమర్శించారు.

ఎక్సైజ్ సుంకం రూ. 5,700 కోట్లు ఎలా పెరుగుతుంది.. ఎక్సైజ్ అండ్ వ్యాట్ ద్వారా రూ. 42 వేల కోట్లు ప్రతిపాదించారు. ఊరికో బెల్ట్ షాప్ ఉందని గతంలో భట్టి అన్నారు.. మీరు ప్రతిపాదించిన దాన్నిబట్టి గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? ప్రజల రక్తమాంసాలు పీల్చి పిప్పిచేసి ఎక్సైజ్ ఆదాయం పెంచుతామని ఒప్పుకున్నారు. ఎక్సైజ్ ఆదాయం రూ.7,200 కోట్లు పెంచుతామని మంత్రి భట్టి చెప్పారు. మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పారు.. రూ.7,200 కోట్లు ఎలా పెంచుకుంటారో చెప్పండి. బీర్లు, చీప్ లిక్కర్, విస్కీల మీద ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు మద్యాన్ని ప్రోత్సహించవద్దు, తెలంగాణను బొందలగడ్డ చేయొద్దు అని హెచ్చరించారు.

నాన్ ట్యాక్స్ రెవిన్యూ ప్రతిపాదన వాస్తవ విరుద్ధంగా ఉంది.. ప్రభుత్వ భూములు అమ్మొద్దని గతంలో రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు అన్నారు. భూములు అమ్మడం ద్వారా రూ. 24 వేల కోట్లు తెస్తామని బడ్జెట్లో చెప్పారు.. రూ.10 వేల కోట్లు భూములు అమ్మడం ద్వారా వస్తాయన్నారు.. రూ.14 వేల కోట్లు ఇతర మార్గాల ద్వారా సాధిస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పకుండా దాచిపెట్టేంత ఇతర మార్గాలేంటి అని హరీష్ రావు అడిగారు.

రుణమాఫీకి రూ. 41 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్లకు తగ్గించారు.. రుణమాఫీలో అనేక కోతలు పెట్టారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని పంద్రాగస్టుకు వాయిదా వేశారు. డిసెంబర్ 9 తర్వాత అప్పుపై వడ్డీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పుకి రైతులు ఎందుకు భారం మోయాలి ? డిసెంబర్ 9 తర్వాత వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకులు చెబుతున్నాయి అని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే నిధులు తగ్గించారు. వైయస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 కొనసాగించాం. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు ఈ ప్రభుత్వం ఆపేసింది.. పేద గర్భిణుల పొట్ట కొట్టకండి. కేసీఆర్ పై కోపం ఉంటే పథకానికి పేరు మార్చుకోండి అని హరీష్ సూచించారు.

ఈ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేశారు.. వాస్తవానికి రూ. 4 లక్షల కోట్లు అప్పుంటే రూ. 7 లక్షల కోట్లని అబద్ధాలు చెబుతున్నారు. కరోనా వల్ల రెండేళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. డిస్కంల అప్పులను కేంద్రం రాష్ట్రంపై బలవంతంగా రుద్దింది అని అన్నారు.

కేంద్రం గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు చేసుకోవాలని అనుమతి ఇచ్చింది. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల రూ. 41 వేల కోట్ల అప్పు.. పదేళ్ల పాలనలో మేం చేసిన అప్పు రూ.3 లక్షల 81 వేల కోట్లు. అవకాశం ఉన్నా ఎక్కువ అప్పులు తీసుకోలేదు. కేంద్రం చెప్పినట్టు మోటార్లకు మీటర్లు పెడితే మరో రూ. 30 వేల కోట్ల అప్పు వచ్చేది.. భవిష్యత్ తరాల పట్ల మా నిబద్ధత ఏంటో దీన్నిబట్టి తెలుస్తోంది అని స్పష్టం చేశారు.

బడ్జెట్ కంటే అత్యంత ప్రాధాన్యత అసెంబ్లీకి ఇంకొకటి ఉండదు.. బేషజాలకు పోయి మా గొంతు నొక్కితే ప్రభుత్వానికే నష్టం. మా గొంతు నొక్కగలరు కానీ.. ప్రజల గొంతు నొక్కలేరు. అప్పుల గురించి చెప్పారు.. మేం సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అని దుయ్యబట్టారు.

సీతారామ ప్రాజెక్ట్ మీద రూ. 8 వేల కోట్లు, పాలమూరు లిఫ్ట్ పై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రూ. 90 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 35 వేల కోట్లు ఖర్చు చేశాం.. రైతుబంధుకు రూ. 72 వేల కోట్లు ఇచ్చాం.

ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబా? ఓఆర్ఆర్ ప్రభుత్వానిదే.. ఎవరికి అమ్మలేదు. భూములమ్మి రూ. 24 వేల కోట్లు సమకూర్చుకుంటామన్నారు..సమాధానం చెప్పాలి. పాలమూరు, రంగారెడ్డి కరువు, వలసలకు రేవంత్ రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కారణం. గత ప్రభుత్వం అనేక ఆస్తుల కల్పన చేసింది అని తెలిపారు.

ఆరు గ్యారంటీల అమలు గాలికి వదిలేశార. రాహుల్ గాంధీతో చెప్పించి.. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ గ్యారంటీ కార్డ్ ఇచ్చారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. సోనియాగాంధీతో కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాయించారు. సోనియమ్మ గౌరవం పోగొట్టారు.. రాహుల్ పరువు తీశారు అని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి రాక్షస భాష చూసి జనం భయపడుతున్నారు.. ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రజలు ఇంకేం అడుగుతారు?
భాష మార్చుకుంటానని రేవంత్ సభావేదిక సాక్షిగా చెప్పారు. గ్రూప్-2 వాయిదా వేయాలని సన్నాసులు అడుగుతున్నారని సీఎం అన్నారు. మూడు రోజులకే ప్రభుత్వం గ్రూప్-2 వాయిదా వేసింది.. ఎవరు సన్నాసులు? మోతీలాల్ ఏ పరీక్ష రాయడం లేదంటే.. ఆయన 3 హాల్ టికెట్లు బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం పోగొట్టొద్దని కోరుకుంటున్నాం అని అన్నారు.

రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డే చెప్పారు.. మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే ప్రజలను క్షమాపణ కోరాల్సింది. ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్లో రూ. 53 వేల కోట్లు, పూర్తి బడ్జెట్లో రూ. 47 వేల కోట్లు.. ఆరు గ్యారంటీల్లోని 13 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీయే పెద్ద ధోకా.. మహాలక్ష్మి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంలో అనేక ఆంక్షలు పెట్టారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికి రూ.500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. కొత్త బస్సులు కొనండి.. సర్వీసులు పెంచండి. పంట కాలానికి ముందే రైతుభరోసా ఇవ్వాలి. 52 లక్షల మంది ఉపాధి హామీ కూలీలందరికి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలి.. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కారు. రాష్ట్రంలో పండే వడ్లలో 90 శాతం దొడ్డురకమే.. మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నిరకాల పంటలకు బోనస్ ఇవ్వాలి.. 90 లక్షల తెల్లరేషన్ కార్డుదారులున్నారు. తెల్లరేషన్ కార్డుదారులందరికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలి.. యువ వికాసానికి ఎలాంటి హామీ లేదు. కాంగ్రెస్ ఆరో గ్యారంటీ చేయూత పథకం ఊసేలేదు.. రూ. 4 వేల పింఛన్ సంగతి దేవుడెరుగు..ఇచ్చే 2 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇప్పటికే 3 నెలల పింఛన్ ప్రభుత్వం బాకీ ఉంది. చేతగానమ్మకు మాటలెక్కువని భట్టి అన్న మాట కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది అని ధ్వజమెత్తారు.

సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. రేవంత్ ప్రజాపాలన ప్రతాపం చూసి కాళోజీ ఆత్మ ఘోషించి ఉంటుంది. నిరుద్యోగులపై ఎక్కడికక్కడ పోలీసుల దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 హత్యలు, 1800 అత్యాచారాలు జరిగాయి. హైదరాబాద్ నగరంలోనే మహిళలకు భద్రత లేదు.. రాత్రి 10 గంటలకే హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేస్తున్నారు.. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.. 8 నెలల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. మొదటి రోజు తప్ప సీఎం మళ్లీ అక్కడ కనిపించలేదు అని హరీష్ విరుచుకుపడ్డారు.

బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఈ బడ్జెట్లో 9 వేల కోట్లు పెట్టారు.. రాష్ట్రంలో 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఊసులేదు. బడే బాయ్ బాటలో ఛోటే బాయ్ నడుస్తున్నారు.. కాంగ్రెస్ మైనారిటీలకు ఎంపీ, మంత్రి పదవులు ఇవ్వలేదు. కొత్త నియామకాలకు, ఉద్యోగులకు కేటాయింపులు లేవు. గ్రూప్-2లో గతంలో వైయస్, ఏపీలో జగన్ పోస్టులు పెంచారు.. లీగల్ సమస్య రాలేదు. గ్రూప్-2 పోస్టులు పెంచాలి, గ్రూప్-1లో 1:100 అవకాశం ఇవ్వాలి.. నిరుద్యోగ భృతి ఎప్పటినుంచి ఇస్తారో చెప్పమన్నారు.

మొన్న చంద్రబాబు కూడా కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని చెప్పారు.. అభివృద్ధి చేసినందుకే హైదరాబాద్‌లో అన్ని సీట్లు గెలిచాం అని హరీష్ పేర్కొన్నారు.