mt_logo

పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు

పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ఇందిరమ్మ గరీబీ హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, గరీబోకో హటావో అంటున్నారు అని మండిపడ్డారు.

జహీరాబాద్‌లోని న్యాల్కల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయ్యింది. ఆ రాయి ఇవ్వాళ జహీరాబాద్ రైతుల నెత్తిన పడింది అని దుయ్యబట్టారు.

ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు హైదరాబాద్‌కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల జాగ తయారు చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయి అని గుర్తు చేశారు.

రంగారెడ్డిలో ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అంటే ఉన్నది అని చెప్పింది. నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్టేట్ చేయాలనే ప్లాన్ న్యాల్కల్‌లో ఇక్కడి భూములు ఎంత బాగున్నాయ్. పచ్చగా పంటలు పండుతున్నాయి. మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉంది బంగారం వలె ఉన్న భూముల్లో ఫార్మాసిటీ ఏమిటి.. 15 వేల ఎకరాల్లో పెట్టు. ఇక్కడ ఎందుకు పడ్డావు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి, ఇక్కడ కంపెనీలు పెడుతావా? అని ధ్వజమెత్తారు.

రైతుల ఉసురు పోసుకుంటున్నవు.. మూసీ ఉద్ధరణ ఇండ్లు కూలగొడుతున్నాడు పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ గరీబీ హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, గరీబోకో హటావో అంటున్నారు. ఇక్కడి ప్రజలు రెండు నెలల నుండి అన్నం తినడం లేదు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రభుత్వ భూములకు పట్టాలు అన్నావు. ఇప్పుడు గుంజుకుంటా ఉన్నావు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ యాడున్నావ్.. నువ్వే స్పందించు. పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు ఉన్న భూములు గుంజుతున్నరు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పు, మా పేదోల్ల భూముల తెరువుకు రావొద్దు ఓట్లు అయ్యాక ఢిల్లీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధు కూడా దిక్కులేదు.. రుణమాఫీ కాలేదు. బతుకమ్మ చీరలు రాలేదు.. తులం బంగారం వచ్చిందా అని అడిగారు.

దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఆగష్టు నాటికి రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రజలను, దేవుళ్ళను మోసం చేసాడు. వంద రోజులు కాదు మూడు వందల రోజులు నిండాయి. ఇక్కడి రెండు వేల ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు.

జేసీబీ, ప్రొక్లైనర్ వస్తే మీ ఎమ్మెల్యే, నేను అడ్డం పడతాము. మా మీద ఎక్కినంకనే మీ వద్దకు అవి రావాలి. గ్రీన్ ట్రిబ్యూనల్, హైకోర్టులో కేసు వేస్తాం మీకోసం.. ఇక్కడి భూమిని పోనివ్వం. ఒక్క మాట మీద ఉండండి. ఎవడు వస్తాడో చూస్తా, ఎట్లా వస్తారో చూస్తా అని సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి.. అక్కడే పెడుతా అని హైకోర్టుకు చెప్పినవ్.. మళ్ళా ఇక్కడ ఎందుకు పెడుతున్నవ్. ఫార్మాసిటీలో ఫార్మాసిటీ పెట్టాలి లేదంటే అక్కడ కూడా భూములు వాపస్ ఇవ్వు. ఇక్కడ భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టకు అని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే పెదల భూములు గుంజుతవా.. మూసీ శుద్ధి అంటున్నావ్. మంజీరను కరాబు చేస్తావా? ఇక్కడి నాలుగు వాగులు, పెద్ద వాగు, చెరువులు, మంజీర కలుషితం అవుతాయి. మెదక్, హైదరాబాద్ ప్రజలకు కలుషిత నీరు అందిస్తారా? అని ప్రశ్నించారు.

పాల లాంటి మంజీరా నీళ్ళల్లో విషపు చుక్కలు కలుపుతవా.. చీకట్లో సంతకాలు పెట్టిస్తారు.. జాగ్రత్తగా ఉండండి.. మోసపోకండి. ఎవరు ఏడవకండి మీకోసం మేము కొట్లాడుతం. మీరు ఐక్యంగా ఉండండి, మీకు అండగా ఉంటాం అని స్పష్టం చేశారు.

రాళ్లు, రప్పలు ఉన్న భూములో ఫ్యాక్టరీలు పెట్టండి.. ఇక్కడ కాదు. నేను, మాణిక్ రావు, ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం జేసీబీలకు అడ్డంగా ఉంటాం. డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. సీఎం కావాలని అన్ని పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి దూకిండు. ధైర్యం కోల్పోవద్దు మొత్తం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది.. అసెంబ్లీలో మీకోసం కొట్లాడుతాం అని హరీష్ రావు హామీ ఇచ్చారు.

ఎవరన్నా వస్తే, ఒక్క ఫోన్ చేయండి రెండు గంటల్లో వస్తాం. తాత తండ్రికి ఇచ్చిన భూమి మీరు మీ పిల్లలకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గద్దలా తన్నుకు పోతా అంటే చూస్తూ ఊరుకోం. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను కేసీఆర్ గారు ప్రారంభించారు. గోదావరి నీళ్ళు మీకు ఇవ్వాలి అనుకున్నారు.. కాంగ్రెస్ వచ్చాక పనులు ఆగిపోయాయి అని పేర్కొన్నారు.