mt_logo

సీఎం కేసీఆర్ ప్రతి అడుగు ప్రజలకోసమే- హరీష్ రావు

భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు గురువారం మెదక్ జిల్లా రామాయంపేట, వెల్దుర్తి, మెదక్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి అడుగు ప్రజల కోసమే ముందుకేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు కళ్ళున్న కబోదుల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోజూస్తున్నాయని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 23 జిల్లాల్లో చెరువుల కోసం రూ. 30 కోట్లు కేటాయిస్తే, ఏడాదిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద రూ.2,050 కోట్లు బడ్జెట్ లో కేటాయించిందని గుర్తుచేశారు. పారదర్శకంగా పనులు చేపట్టి రూ. 600 కోట్ల ప్రజా ధనాన్ని కాపాడామని, ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులని, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కుట్రలు మాని తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని మంత్రి సూచించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యాన్ని ప్రభుత్వం త్వరలో తేల్చనున్నదని, ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, భారీ పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావులు చక్కెర యాజమాన్యాలతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. చెరుకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలో శుభవార్త వింటారని హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *