mt_logo

రూ. 2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు.. కానోళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి: హరీష్ రావు

కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది.. తొలినాళ్లలో నిజామాబాద్ జిల్లా పరిషత్‌ను గెలిపించి, తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన ప్రాంతం, ఈ కామారెడ్డి నియోజకవర్గం అని అన్నారు.

అదే పోరాట స్ఫూర్తితో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని మనం గెలిపించాలి. యాసంగి వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ బాండు పేపర్లు ఇచ్చింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి అని తెలిపారు.

100 రోజుల పాలనకు ఈ ఎన్నిక రెఫరెండం అంటున్నారు.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం. రూ. 2 లక్షల రూపాయల రుణమాఫీ, రూ. 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి.. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి అని హరీష్ పేర్కొన్నారు.

అవ్వా, తాతలకు, వికలాంగులకు, బీడీ, గీత కార్మికులకు.. ఇతర పింఛనుదారులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది.. వాళ్లందరికీ ఈ విషయం వివరించాలి.. ఇప్పుడు వడ్లు వస్తున్నా రైతుబంధు రూ. 15 వేలు ఇంకా ఇవ్వలేదు.. పదివేలు కూడా రాలేదు.. 15 వేల రైతుబంధు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు, రాని వాళ్లకు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలి అని పిలుపినిచ్చారు.

రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ సాధించి పెట్టాడు కేసీఆర్.. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం.. కేసీఆర్ చెంత ఉన్న నాయకులను కాంగ్రెస్ ఇదివరకు కూడా తీసుకెళ్లింది. కాంగ్రెస్ కొంతమంది నాయకులను కొంటుందేమోగాని బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేదు అని అన్నారు.

పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు. కామారెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు ఇక్కడికొచ్చి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదు అని అభిప్రాయపడ్డారు.

రూ. 2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి.. వందరోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోవద్దు.. కేసీఆర్ మాట తప్పని మనిషి. కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదు అని గుర్తు చేశారు.

యాసంగి వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలి.. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి. ప్రతి నెల రూ 2,500 డిసెంబర్ నెల నుండి ఇస్తా అన్న హామీ నిలబెట్టుకోవాలి అని అన్నారు.

కరోనా సమయంలో కూడా ఈ రోజు రైతు బంధు ఆగలేదు.. వాళ్లు ఎకరాకు ఇస్తా అన్న రూ. 15 వేలు కాదు కదా.. 10 వేలు కూడా కోతలకు దగ్గర వచ్చిన వారి సరిగా ఇయ్యలే. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలి.. అప్పుడే వాళ్లకు తాము మోసం చేశామని తెలుస్తుంది అని హరీష్. పేర్కొన్నారు

తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికలు దగ్గర వచ్చినయి కాబట్టి ఇయ్యాల పెట్రోల్, డీజిల్ మీద 2 రూపాయలు తగ్గించిర్రు. కేసీఆర్ కన్నా యజ్ఞ యాగాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. బీజీపీ దేశంలో రైతుల కోసం, గిరిజనుల కోసం చేసిందేం లేదు అని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అవకాశవాదులను, ప్రలోభాలకు గురై పార్టీలు మారిన వారిని ఇక పార్టీలోకి తీసుకోబోము.. తెలంగాణ రాష్ట్రం తరపున ప్రశ్నించే గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని కోరారు.