mt_logo

సోషల్ మీడియాలో లీకు న్యూస్‌లు, ఫేక్ వార్తలతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతుంది: హరీష్ రావు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు అని విమర్శించారు.

6 గ్యారెంటీలలో ఇస్తానన్న మొదట హామీ అయిన ప్రతి నెల రూ. 2,500 లు డిసెంబర్ నెల నుండి ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త హామీలు అమలు కాకపోగా, ఉన్న పథకాలు కూడా అటకెక్కించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వచ్చింది.. కరువు వచ్చింది.. కరెంట్ మోటార్లు కాలిపోతున్నయి.. ఈ 100 రోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది అని హరీష్ అన్నారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం.. రూ. 2 లక్షల రూపాయల రుణమాఫీ, రూ. 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు.. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి.. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి..అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదు అని తెలిపారు.

యాసంగి వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో ప్రశ్నించాలి.. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి.. రూ.2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి అని పిలునిచ్చారు.

వంద రోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోవద్దు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన నాయకులకు మీరు ఈ రోజు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

నిరుద్యోగులను, రైతులను మోసం చేసిన పార్టీ బీజేపి.. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి? ఏం ఇచ్చిందని బీజేపీ పార్టీకి ఓటు వేయాలి.. రాముడి అక్షింతల పేరుతో రాజకీయం చేయడం తప్పా.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని దుయ్యబట్టారు.

సోషల్ మీడియాలో లీకు న్యూస్‌లు, ఫేక్ వార్తలతో గోబెల్స్ ప్రచారం చేయిస్తు రాజకీయ పబ్బం గడుపుతుంది కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తు పై గెలిచి ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి గారు వెంటనే మీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని, స్పీకర్ గారు కూడా వారిపై చర్యలు తీసుకోని, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీష్ రావు అన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తరు కావచ్చు.. కానీ వారి ఆత్మగౌరవాన్ని కొనలేరు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు.. గాంధేయవాదంతో రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మన అధినేత కేసీఆర్ అని పేర్కొన్నారు.

అదే పోరాట స్ఫూర్తితో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ గారిని మనం గెలిపించాలి అని కోరారు.