mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింది: హరీష్ రావు

మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గత సంవత్సరం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది అని గుర్తు చేశారు.

సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయింది అని దుయ్యబట్టారు.

సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు రూ. 1800లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నాను ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసి రైతులకు రూ. 500 బోనస్, రూ. 15,000 రైతుబంధు ఇస్తానని చెప్పి మాట తప్పావా లేదా? రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్లో కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.

నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, రూ. 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో రూ. 50 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వడ్లకు మద్దతు ధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేసిన పరిస్థితి వచ్చింది. కొన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ రావు అన్నారు.

నిన్న జగిత్యాల జిల్లా పర్యటనలో అక్కడి రైతులని అదిగితే ఒక కిలో సన్నవడ్లు కూడా కొనలేదని చెప్పారు.ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదు. సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విఫలమైంది. ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది అని ధ్వజమెత్తారు.

వడ్లు కొనకపోతే అధికారులను మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు. మందు అమ్మకాల టార్గెట్ పెట్టి జనాలకు మందు ఎక్కువ తాగించి ఆదాయం పెంచాలని ఒత్తిడి చేస్తూ మెమోలిస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. 25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు అని హరీష్ రావు అన్నారు.

తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మద్యాన్ని ఏరులై పారిస్తామని కంకణం కట్టుకున్నాడు. తెలంగాణలో ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చావు కానీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి మహిళల పుస్తెల్లు తెంపుతున్నావ్ అని దుయ్యబట్టారు.

మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేశావ్.. వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మహిళలకు అందజేయడం లేదు. భర్తలకు మద్యం తాగించి ఇల్లు గుల్ల చేయాలని చూసి మహిళలను ఇబ్బంది పెడుతున్నావ్. ముఖ్యమంత్రి ప్రజల గురించి కాకుండా పైసల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు అని ఆక్షేపించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందిందా లేదా రుణమాఫీ జరిగిందా లేదా సకాలంలో బోనస్ అందించారా లేదా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారా లేదా అనే సోది లేదు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం నుంచి దళారుల వచ్చి తెలంగాణలో రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారు అని పేర్కొన్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశావ్. రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నారు. ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 15,000 రూపాయల రైతుబంధు రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.