అసెంబ్లీ ఎన్నికలప్పుడు రుణమాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరమని చెప్పి, తీరా చేసింది రూ. 17 వేల కోట్లు.. అంటే రూ. 23 వేల కోట్లు కోత పెట్టిండు అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలె, డబ్బులు డబుల్ కావాలె.. అటువంటిది రైతుల సంఖ్య దాదాపు 14 లక్షలు ఎట్ల తగ్గింది. రైతుబంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నవ్, డబ్బా వాయిస్తున్నవ్ అని రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫ్లాప్, తొండి చేయడంలో తోపు, బూతులు మాట్లాడంలో టాపు అని ఎద్దేవా చేశారు
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని బిగ్గరగా అరిచినట్లు ఉంది. రుణమాఫీ ఎగనామం పెట్టీ ఫోజులు కొడుతున్నారు.. పాక్షికంగా అమలు చేశారు తప్ప పూర్తిగా చేయలేదు అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఇదే నోటితో చెప్పిండు.. ఏమైంది.. డిసెంబర్ 9 మాట తప్పిండు. ఇగ వట్టిగ డేట్లు చెబితే నమ్మరని పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కించుకోవడానికి కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి అదే నోటితో రూ. 31 వేల కోట్లు ఆగస్టు 15 కల్లా చేస్తానన్నడు. బడ్జెట్ డాక్యుమెంట్‌లో రూ. 26 వేల కోట్లు అని పెట్టిండు అని అన్నారు.
నేను అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రశ్నించిన.. మొదట రూ. 40 వేల కోట్లన్నవు, తర్వాత రూ. 31 వేల కోట్లన్నవు, బడ్జెట్లోనేమో రూ 26 వేల కోట్లు పెట్టినవ్ అని ప్రశ్నించిన.. ఏ రైతులను తీసేస్తున్నవ్, ఎందుకు తీసేస్తున్నవ్ అని నిలదీశిన. రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చ పెట్టాలని పట్టుపట్టిన.. పెడతా అని చెప్పి ముఖం చాటేసి పారిపోయిండు. మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు అని విమర్శించారు.
సరే చేసిండేమో అనుకొని లెక్కలు చూస్తే కేవలం రూ. 17 వేల కోట్లతో 22 లక్షల మందికి చేసిండని లెక్క తేలింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూ. 40 వేల కోట్లు చెప్పి, తీరా చేసింది ఎంతంటే రూ. 17 వేల కోట్లు. అంటే రూ. 23 వేల కోట్లు కోత పెట్టిండు క్యాబినెట్ మీటింగ్ నాడు, పార్లమెంట్ ఎన్నికల నాడు చెప్పిన రూ. 31 వేల కోట్లతో పోలిస్తే రూ. 14 వేల కోట్లు కోత పెట్టిండు. బడ్జెట్ కేటాయింపుల్లో చెప్పిన రూ. 26 వేల కోట్లతో పోలిస్తే రూ. 9 వేల కోట్లు కోత పెట్టిండు అని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపుడు రైతుల సంఖ్య 47 లక్షలు అని చెప్పిండు.. మొత్తంగా మూడు విడతలకు 22 లక్షల మంది రైతులకు చేసిండు. అంటే చెప్పిన సంఖ్యకు సగం కూడా చెయ్యలేదు.. లెక్కచేస్తే 46 శాతం మంది రైతులకే చేసినట్లు తేలుతున్నది. సుమారు 25 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టినట్లు తన రికార్డులే చెబుతున్నాయి. ఈపాటి పోటు పనికి సిగ్గులేకుండా తను తన వందిమాగదులు కలిసి రుణమాఫీ చేసినం అని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నరు అని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డిది నోరా మోరా.. చెప్పెటోనికి చెవుడైనా వినేటోనికి వివేకం ఉంటది కదా.. మొదటి దఫా మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే 36 లక్షల మంది రైతులకు రూ. 17 వేల కోట్ల ప్రయోజనం చేకూరింది. మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలె, డబ్బులు డబుల్ కావాలె. అటువంటిది రైతుల సంఖ్య దాదాపు 14 లక్షలు ఎట్ల తగ్గింది.. డబ్బు గదే రూ. 17 వేల కోట్లకు అటు ఇటుగా ఉన్నది అని అన్నారు.
రేవంత్ రెడ్డి నేను మళ్లీ సవాల్ విసురుతున్నా.. రైతులందరికి రుణమాఫీ అయ్యిందని దమ్ముంటే నిరూపించు.ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు.. ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం. నీ నియోజకవర్గం లేదా నా నియోజకవర్గం.. ఎక్కడికైనా పోదాం.. నేనంటన్నది కరెక్టో, నువ్వంటున్నది కరెక్టో ఖుల్లం ఖుల్లా తెలుస్తది. నీ ప్రకటనల డొల్లతనం కూడా బయట పడుతది.. వస్తవా? పోదామా రేవంత్ రెడ్డి? అని సవాల్ విసిరారు.
నేను నీలాగా మాట తప్పెటోడిని కాదు.. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పార్టీలు మారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కాదు నాది. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడిని, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు లెక్కపెట్టకుండా రాజీనామాలు చేసినోడిని. నువ్వు చంద్రబాబు చంకల జొర్రి రైఫిల్ పట్టుకున్న నాడు నేను ప్రజల కొరకు రాజీనమా చేసినవాడిని అని హరీష్ రావు గుర్తు చేశారు.
రుణమాఫీ చేసిన, రాజీనామా అని రంకెలేస్తున్నవ్ రేవంత్ రెడ్డి.. నేను చాలా స్పష్టమైన సవాల్ విసిరిన.. ఆగస్టు 15లోపు రైతులందరికి రూ. 2 లక్షల రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను సంపూర్ణంగా నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన.. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామి నెరవేరితే చాలు.. పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నా.ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెట్టు, కనీసం రుణమాఫీ మాటను కూడా నెరవేర్చుకోలేకపోయావు.. అడ్డంగా దొరికిపోయావు. నేను అనుకున్నట్లుగానే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపి పెట్టినవ్ అని ధ్వజమెత్తారు.
ఇది కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చుతూ రోత ప్రచారం మొదలు పెట్టినవ్.. మభ్యపెట్టి మతలబు చేసి ఎక్కువ రోజులు అందరిని నమ్మించలేవు.రైతన్నను దగా చేసిన నీ తీరును యావత్ ప్రజానీకం గమనిస్తున్నది. అధికారంలోకి వచ్చేది మేమే రూ 2 లక్షల రుణాలు తెచ్చుకోండి అని రెచ్చగొట్టినవ్.. తీరా అధికారంలోకి వచ్చి 8 నెలల గడిచాక రుణమాఫీకి గండి కొట్టినవ్ అని అన్నారు.
అధికారం దక్కించుకునేందుకు మోసం.. దక్కిన అధికారాన్ని నిలుపుకునేందుకు మరో మోసం.. నీ 8 నెలల ప్రయాణమంతా మోసాల చరిత్రనే రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదన్నరేండ్ల కాలంలో రూ. 70 వేల కోట్లు రైతుబంధు కింద, రూ. 30 వేల కోట్లు రుణమాఫీ కింద మొత్తం లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక ఉసూరుమనిపించినవ్ అని మండిపడ్డారు.
రైతులకు రైతుభరోసా అన్నవ్, రైతు కూలీలకు అన్నవు, కౌలు దారులకు అన్నవ్ అందరికి ఎగనామం పెట్టినవ్.. రైతుబంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నవ్, డబ్బా వాయిస్తున్నవ్ అని విమర్శించారు.
ఆగస్టు 6న తెలంగాణ భవన్‌లో రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినం.. ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా గడిచిన 10, 11 రోజుల్లో లక్ష 16 వేల ఫిర్యాదులు వచ్చినయ్. రుణమాఫీ కాలేదు న్యాయం చేయండని రైతులు ఆవేదన చెందుతున్నరు ఊళ్లల్లకు పోతే రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు.. రుణమాఫీ కోసం అగ్రికల్చర్ ఆఫీస్, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. అధికారుల కాళ్ల వేళ్ల మీద పడి వేడుకుంటున్నరు.. ఓపిక నశించి బ్యాంకుల ముందు నిరసన తెలుపుతున్నరు. ఇదంతా అబద్ధమా రేవంత్ రెడ్డి . రోజూ పత్రికల్లో, టీవీల్లో వస్తున్నవే కదా.. రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదు అని అడిగారు.
ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు మీరు రుణమాఫీ చెయ్యక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తున్నది. దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేతపత్రం విడుదల చేయండి. రైతులు ఎందరు, అప్పు ఎవరికి ఉంది.. ఎంత డబ్బు ఖాతాల్లో జమ అయ్యింది బయటపెట్టండి అని డిమాండ్ చేశారు.
ఒక్క విషయంలో మాత్రం నిన్ను ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి.. పరిపాలనలో ఫ్లాప్, తొండి చేయడంలో తోపు, భూతులు మాట్లాడంలో టాపు.. ఇందులో ఎవరికి అనుమానం లేదు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి, సిగ్గులేక చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంటే అన్నట్లు నన్ను రాజీనామా చెయ్యమంటున్నవు. రుణమాఫీలో కోత, మాటలేమో రోత.. ఇది నీ వైఖరి.. బూతులు తిడితే రుణమాఫీ అయిపోతుందా.. ఖాతాల్లో డబ్బులు పడతాయా? అని ప్రశ్నించారు.
తొండి చేసుకుంట మొండిగ మాట్లాడుతున్నవ్.. రంకెలేస్తే అంకెలు మారిపోవు.. అబధ్ధాలు నిజమైపోవు. మమ్మల్ని తిట్లు తిడుతవ్ కావొచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మర్చిపోతవు అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఏమన్నడు.. ఎన్ని దేవాలయాల మీద ఒట్లు వేసిండు. యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహా స్వామి సాక్షిగా.. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా.. జోగులాంబ సాక్షిగా.. బాసర సరస్వతి మందిరం సాక్షిగా.. కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా.. కురుమూర్తి సాక్షిగా.. సిద్ధుల గుట్ట సాక్షిగా.. అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా.. పాలమూరు ప్రజల సాక్షిగా, జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా… సేవాలాల్ సాక్షిగా, బావూజీ సాక్షిగా…
మెదక్ చర్చ్ సాక్షిగా… ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా.. అంటూ గుడి, చర్చి, మసీద్ సాక్షిగా ఒట్లు వేసి రుణమాఫీ అమలు చేస్తానని మాట తప్పిండు.. హిందు, ముస్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేసిండు.. రైతులనే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డడు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
పాలకుడిగా నువ్వు పాపం మూటగట్టుకున్నవు.. రాష్ట్రానికి ఎక్కడ లత్తగొడుతదో అని ప్రజలు భయపడుతున్నరు.. రైతులకు తీరని ద్రోహం చేసినవ్, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినవ్. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుంది. ఊర్లల్ల అదే భయపడుతున్నారు.. దేవుళ్ళ మీద నిజమైన భక్తి ఉన్న ప్రతి వ్యక్తీ నువ్వు చేసిన పాపం చూసి భయపడుతున్నాడు అని అన్నారు.
నువ్వా ప్రాయశ్చిత్తం చేసుకోవు.. నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేను తీర్థయాత్రకు బయలుదేరుతా.. మా పార్టీ సీనియర్ నాయకులు కూడా వస్తారు. ముక్కోటి దేవతల్ని, అల్లా, జీసస్‌లను వేడుకుంటా.. ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు కీడు చేయొద్దని వేడుకుంటా అని తెలిపారు.
ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా రుణమాఫీ అయ్యిందా లేదా చెబుతరు.. ఎంత మంది ఉండే, ఎంత మందికి వచ్చింది సింపుల్.. అది చెప్పలేక, సిగ్గులేదని, జాతి అని మాట్లాడుతారు.. సీఎం ఇలా మాట్లడచ్చునా. మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాం.. ప్రశ్నిస్తే చావాలని మాట్లాడుతున్నారు.. నీ గాడ్ ఫాదర్స్‌కి భయపడలేదు.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడం అని పేర్కొన్నారు.
రుణమాఫీ విషయంలో మాట తప్పావ్ ఫెయిల్ అయ్యావు.. రుణమాఫీ రైతులందరికి చేసే దాకా, రైతుభరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తాం.. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. పార్టీ తరుపున త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.. రైతుల తరుపున పోరాటం చేస్తం అని హరీష్ రావు తెలిపారు.