రాజ్ భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర మంత్రివర్గానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి ఆలోచనలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలుచేసి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి మంచిపేరు తీసుకొస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షలను నిజం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణ గల కార్యకర్తగా దానిని అమలు చేస్తాను. నాకు అసంతృప్తి ఉండటం లాంటిది ఏమీ లేదు. ఎన్నికల సమయంలోనూ చెప్పాను. నేను టీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కల సైనికుడిగా పనిచేస్తున్నాను. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఇప్పటికే పదుల సంఖ్యలో చెప్పడం జరిగింది. ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరుమీద ఎటువంటి గ్రూపులు, సేవలు లేవు. ఎవరైనా పెట్టుకుంటే దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని, అందరూ పార్టీ కోసం, సీఎం కేసీఆర్ కోసం పనిచేయాలని హరీష్ రావు కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.