mt_logo

తనపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన హరీష్ రావు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు.

నా ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగింది. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అని హరీష్ రావు అన్నారు.

ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తాను అని తెలిపారు.

ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం అండగా నిలిచే నా పై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.

ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరువు భత్యాలు విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలి అని హరీష్ రావు స్పష్టం చేశారు.