కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. అ’శోక నగరాన్ని సందర్శించాలని రాహుల్ గాంధీని కోరారు.
రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ ఛార్జీ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు అని దుయ్యబట్టారు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా పేరు మార్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది అని హరీష్ రావు విమర్శించారు.
పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది అని పేర్కొన్నారు.