ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రజాతంత్ర పత్రిక 17వ వార్షికోత్సవ సభకు భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజాతంత్ర ప్రచురించిన ఉస్మానియా నుండి మానుకోట వరకు ఆరునెలల ఉద్యమప్రస్థానం ప్రత్యేక సంచికను మంత్రి హరీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాతంత్ర పత్రిక కృషిని మరువలేమని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష తదితర సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ప్రజాతంత్ర కీలకపాత్ర పోషించిందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ వరకు కొనసాగిస్తూ బతికించడంలో ఏవిధంగా కృషి చేశారో, అదేవిధంగా ప్రజాతంత్ర పత్రిక కూడా కృషి చేసిందని, పత్రిక నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఉద్యమబాట పట్టించేందుకు ప్రజాతంత్ర పత్రిక దోహదపడిందని, తెలంగాణ అస్థిత్వ పోరాటం, భావజాల వ్యాప్తిలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని అన్నారు. వలసవాదులు వనరుల దోపిడీ, సంస్కృతిపై దాడి చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం పత్రికలు పోరాటం చేశాయని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇండియన్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, ప్రజాతంత్ర సంపాదకుడు దేవులపల్లి అజయ్, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.