mt_logo

రేవంత్ మోసాలు నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్ధమయ్యాయి: హరీష్ రావు

మెదక్ సభలో సీఎం రేవంత్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నాడు అని పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్‌లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇందిరాగాంధీ మెదక్‌కి ఏం చేసింది? మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. మూడు యూనివర్సిటీలు తెచ్చిండు అని తెలిపారు.

మెదక్‌లో ఏం అభివృద్ధి జరిగిందో కళ్లు పెద్దవి చేసి చూడు రేవంత్.. లేకపోతే నువ్వొస్తే నేను చూపిస్తా. మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈరోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అంటే అది కేసీఆఆర్ చలవే.. ఉమ్మడి పాలనలో మెదక్ సింగూరు నీళ్లు తరలించుకుపోలేదా? అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో విలువలు ఉండాలి.. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడడం లేదు. కానీ నీకు నీ భాషలోనే మాట్లాడితనే అర్థం అవుతుంది. మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు అని నేననాలా? సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు. పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ కేసీఆర్ మెదక్‌కు చేసిన అభివృద్ధి కనపడుతుంది అని దుయ్యబట్టారు.

మెదక్‌ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైలు సౌకర్యం కల్పించాలంటే పెడచెవిన పెట్టారు.. సింగూరు జలాలు మెదక్ రైతులకే ఇవ్వాలనే డిమాండ్‌పై ధ్యాస పెట్టలేదు. ఇవన్నీ చేసింది కేసీఆర్ కాకపోతే మీ అయ్య వచ్చి చేశాడా రేవంత్ రెడ్డి? అని అడిగారు.

ఆరోగ్యం బాగాలేని కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే రేవంత్ తాపీగా క్రికెట్ చూస్తున్నాడు. పాలన చేతగాక, నా ప్రశ్నలకు జవాబు చెప్పడం చేతగాక నాపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన ఆ మహానేతపై ఇష్టమొచ్చినట్టు మొరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని హరీష్ అన్నారు.

మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలంతా నమ్ముతున్నారు. అందుకే మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. బెయిల్ మీద ఉన్న ఓటుకు నోటు దొంగ రేవంత్ నీతులు చెబితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ పిట్టలదొరలా మాట్లాడినట్టే ఇపుడూ మాట్లాడి ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటున్నడు అని విమర్శించారు.

రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమయ్యాయి.. రేవంత్ ఎన్ని కట్టుకథలు, పిట్టకథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది రేవంతే.. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు లంటిది ఎవరైనా ఇస్తే అది కచ్చితంగా రేవంత్‌కే వస్తుంది అని అన్నారు.

కారును ఇనుప సామాను కింద అమ్మడం కాదు, నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడటం ఖాయం.  రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో.. పార్టీ మారడం తప్పు అని అన్నాడు.. రేవంత్ మా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పితే ఫిరాయింపులపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన కఠిన చట్టం హామీని ఉల్లంఘించినట్టే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మిగతా హామీలపై కూడా చిత్తశుద్ధి లేదు అని ధ్వజమెత్తారు.

రైతు రుణమాఫీపై ఇప్పటికే అనేక తేదీలు చెప్పిన రేవంత్.. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నాడు. ఆగస్టు 15న రుణాలమాఫీ జరుగుతుందని రైతులు విశ్వసించడం లేదు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మాట తప్పిన రేవంత్‌కి మోసం కొత్త కాదు.. మోసం అతని నైజం అని హరీష్ ఫైర్ అయ్యారు.

బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, పార్లమెంటు ఎన్నికల్లోగానీ ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. రాష్ట్రంలో మాదిగలకు తీరని ద్రోహం చేసావ్ అని మీ పార్టీ నాయకుడు మోతుకుపల్లి నిరాహార దీక్ష చేస్తున్నడు. రేవంత్ చేసే సామాజిక న్యాయం ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది.  బీసీల, మాదిగల ద్రోహి రేవంత్‌కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు అని పేర్కొన్నారు.

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురించి రేవంత్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు. మెదక్‌లో లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చింది మా వెంకట్రామిరెడ్డి. నువ్వు ఈరోజు హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద నీళ్లు తీసుకొనిపోయావంటే అది మా వెంకట్రామిరెడ్డి చేసిన కృషి వల్లే అని గుర్తు చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములకు పరిహారం ఇచ్చింది వెంకట్రామిరెడ్డి. ఇంతకంటే ఉత్తమమైన పునరావాస కాలనీ దేశంలో ఎక్కుడుందో చెప్పాలి? జరిగిన మేలు రేవంత్ రెడ్డి కనిపిస్తలేదు నాలుగు జిల్లాల దాహార్తి తీర్చిన గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణంలో వెంకట్రామిరెడ్డి పాలుపంచుకున్నారు అని అన్నారు.

మెదక్ పార్లమెంట్ ఓటర్ వెంకట్రామిరెడ్డి. కొడంగల్‌లో చిత్తుగా ఓడిన నువ్వు మల్కాజిగిరికి, రాహుల్ గాంధీ వయనాడ్‌కి వెళ్లలేదా? రేవంత్ గాలిమాటలు, పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిది అని సూచించారు.

ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని, అవాకులు చవాకులు బంద్ చేయి తొక్కుకుంటా వచ్చిన అంటున్నవు.. టీడీపీలో ఉన్న నాయకులను తొక్కినవు, కాంగ్రెస్‌లోని నిజమైన కాంగ్రెస్ నాయకులను తొక్కినావు. ప్రజాపాలనలో ప్రజలను కలవడం లేదు.. మీ సొంత పార్టీ నాయకులు హన్మంతరావుకు, మోత్కుపల్లికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కలవడం లేదు అని అన్నారు.

రైతుల కష్టాలు పట్టడం లేదు. తడిచిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు.. మంత్రులు, కలెక్టర్లు రారు.. మక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఆ రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను మద్దతు ధరకు కొనడం లేదు. కేంద్రాల్లో రైతులు ఎండకు ఇబ్బంది పడుతున్నారు.. రైతులపై మీకెందుకు ఇంత పగ? అని ప్రశ్నించారు.

మెదక్ గడ్డ గులాబీ జెండా అడ్డా.. 2004 నుంచి ఇక్కడ గెలుస్తున్న బీఆర్‌ఎస్ మళ్లీ గెలవబోతోతున్నది అని తేల్చి చెప్పారు.