mt_logo

ఏప్రిల్ 16న సుల్తాన్‌పూర్‌లో జరిగే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌లో జరగనున్న బీఆర్ఎస్ – కేసీఆర్ బహిరంగ సభాస్థలిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు.

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి సభను అందరూ విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలను, నాయకులను హరీష్ రావు కోరారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ స్థానాలకు సంయుక్తంగా 16 తేదీన జోగిపేట సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి ఆని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదు.. నాడు కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలు తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడ్డారు అని పేర్కొన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే.. పదవిలోంచి దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది.. బీఆర్ఎస్ సర్కార్ పనితీరుకు ఇదే నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోంది అని విమర్శించారు.

రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట ఎండిపోతోంది.. రైతులు తమ వరి ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ధాన్యాన్ని ⁠ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాన్ని కొనేలా మేము రైతులకు అండగా ఉంటాం.. బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం అని హరీష్ హెచ్చరించారు.

కాంగ్రెస్, బీజేపీలు తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయి.. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతాం. పార్లమెంట్‌లో తెలంగాణ వాదం వినిపించాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేయించాలన్నా కారు గుర్తుకు ఓటు వేయాలి అని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించాం.. కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలి అని అన్నారు.