mt_logo

సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు 70 ఎంఎం సినిమా ఉంది రేవంత్ రెడ్డికి: హరీష్ రావు

రైతులకు మద్దతుగా కోరుట్ల నుండి జగిత్యాల వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. మీకు సంజయ్ గారు మంచి ఎమ్మెల్యేగా మాత్రమే తెలుసు. మాకు యశోద హాస్పిటల్ డాక్టర్‌గా తెలుసు. ఎవరికి ఆపద వచ్చినా నేను ఫోన్ చేస్తే బిల్లు మాఫీ చేసేవాడు అని కొనియాడారు.

వెన్నుముక శస్త్ర చికిత్స చేసే డాక్టర్.గా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ ఈరోజు దేశానికి వెన్నుముకైన రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వారికి నా అభినందనలు అని తెలిపారు.

రేవంత్ రెడ్డి పాలనలో రైతుల ధాన్యం దళారుల పాలయింది. క్వింటాల్ పైన ఒక్కొక్క రైతు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరి పంటకు బోనస్ అని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.

వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెలరోజుల ముందు నుండే రివ్యూ మీటింగ్‌లో పెట్టేవాడు. వడ్లు కొన్న 24 గంటలలోపే రైతులకు పైసలు అందించేది కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వడ్లు కొనాలని, మొద్దు నిద్రపోతున్న రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక హామీ అయినా అమలు చేశాడా అని అడిగారు.

ఎన్నికల అప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో రైతుబంధు పైసలు రైతులకు వేస్తామని నేను ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి రైతుబంధు చేయకుండా చేసింది. ఇప్పుడైతే రూ. 10,000, కాంగ్రెస్ వస్తే రూ. 15,000 వస్తాయని రైతులను నమ్మించి ఎన్నికల్లో మోసం చేశారు. ఎన్నికల ముందు మేము రైతుల కోసం సిద్ధం చేసిన రైతుబంధు డబ్బులు పడ్డాయి తప్ప ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వెయ్యలేదు. బోనస్ బోగస్ అయింది.. రైతుబంధు రాదు, రుణమాఫీ కాదు అని అన్నారు.

జగిత్యాల చుట్టూ ఉన్న వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధరంపురి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్లు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు. నా ఎమ్మెల్యే పదవి కంటే 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావడమే నాకు ముఖ్యమని నేను రాజీనామాకు సిద్ధమయ్యాను. రుణమాఫీ కాకపోతే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖం చాటేశాడు అని విమర్శించారు.

పంద్రాగస్టు వరకు పూర్తి రుణమాఫీ చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. చేయకపోతే మళ్లీ వెంటపడితే దసరాకు అన్నాడు. దసరా పోయింది, దీపావళి పోయింది. అయినా రుణమాఫీ కాలేదు. రెండు లక్షల పైనున్న బకాయిలు కడితే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు. నమ్మి బకాయిలు కట్టిన రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు అని హరీష్ రావు దుయ్యబట్టారు.

రైతులకు చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ చెయ్.ఆలస్యం లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలి. మేనిఫెస్టోలో పెట్టకున్నా ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా రైతులకు పదివేల రైతుబంధు ఇచ్చిండు కేసీఆర్. రూ. 72,815 కోట్ల రూపాయలు రైతుబంధు రైతులకు అందించింది కేసీఆర్. కరోనాలో లాక్.డౌన్ పెట్టినా రైతులకు రైతుబంధు ఆపలేదు కేసీఆర్. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి రైతుబంధు వేయడం లేదని నేను అడుగుతున్నా? మూసీ సుందరీకరణకు రూ. 1,50,000 కోట్లు ఎక్కడినుండి వస్తున్నాయి రేవంత్ రెడ్డి? రైతులకు ఇవ్వడానికి లేని పైసలు మూసి సుందరీకరణకు ఎక్కడి నుండి వస్తున్నాయి? అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సాక్షిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చి చూపించిండు. తెలంగాణలో 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను కట్టించింది కేసీఆర్. జగిత్యాలలో చుక్క నీళ్ల కోసం వరడ కాలువలో ధర్నా చేసే పరిస్థితి ఉండేది. వరద కాలవను రిజర్వాయర్‌గా మార్చిండు కేసీఆర్. కాలువ నుండి మోటార్లు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను తెచ్చిండు కేసీఆర్ అని గుర్తు చేశారు.

చెరువులన్నిటికీ తూములు పెట్టి వరడ కాలువ ద్వారా నీళ్ళను అందించి రెండు పంటలు పండేలాగా చేసిండు కేసీఆర్. దేశంలో రైతుల సీఎంగా పేరు పొందిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి బూతుల సీఎంగా పేరు పొందిండు. సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే ముందు ముందు 70 ఎంఎం సినిమా ఉంది రేవంత్ రెడ్డి నీకు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు నీ మంత్రులు భూమి మీద తిరగండి గాలి మోటర్‌లో కాదు అని ఎద్దేవా చేశారు.

రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా వడ్ల లోడు ఎత్తుమని అడుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడెత్తుతున్నాడు. వడ్ల లోడు కాదు డబ్బు మూటల లోడు మహారాష్ట్రకెత్తుతున్నాడు రేవంత్ రెడ్డి. నోట్ల లోడ్ ఎత్తడంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. మూసీ పాదయాత్ర దమ్ముంటే ఇల్లు కూలగొట్టిన చోట పాదయాత్ర చేయు అని సవాల్ విసిరారు.

మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి కంపు ఎక్కువ. ఇక్కడ నుండే వేములవాడ రాజన్నను, కొండగట్టు అంజన్నను కోటిలింగాల శివన్నను, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటున్నా . మీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన ఈ పాపాత్ముడిని క్షమించండి. ఈ పాదయాత్ర నుండి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒకటే. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం యాసంగికి కలిపి రూ. 15 వేల రైతు భరోసా వెయ్యాలి. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇస్తానని ఇచ్చారా? రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అన్నాడు చేశాడా.. రూ. 15000 రైతు భరోసా ఇస్తానన్నారు ఇచ్చాడా? మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు ఇచ్చారా? మహారాష్ట్రలో మహిళలకు 4000 రూపాయలు ఇస్తామని దొంగహామీ ఇస్తున్నాడు. గెలిచిన తెలంగాణలో రూ. 2500 దిక్కులేదు కానీ మహారాష్ట్రలో రూ. 4000 ఇస్తారంట అని ధ్వజమెత్తారు.

వందరోజుల్లో ఇచ్చిన హామీల అమలు చేస్తామన్నారు. 300 రోజులు దాటిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులన్నారు ఇచ్చాడా? నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామన్నాడు ఇచ్చాడా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కెసిఆర్ ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు నేనిచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి? ఇచ్చాడు చూపించాలి అని అన్నారు.

రూ. 300 కోట్లు ఖర్చుపెట్టి పేపర్లలో ఘనంగా అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చాడు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పోలీసుల చేతులతో పోలీసోళ్ళ భార్యలను పిల్లలను కొట్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసోళ్ళని రోడ్డు మీదకు తెచ్చిండు .పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులను రోడ్డు మీదకు తెచ్చిండు. కేసీఆర్ గురుకులాలో విద్యార్థులను ఐఏఎస్ లను చేసిండు డాక్టర్లను చేసిండు. ఐఐటీలో చదువుకునే అవకాశాన్ని కల్పించిండు. రేవంత్ రెడ్డి మాత్రం గురుకుల విద్యార్థులను రోడ్లెక్కించాడు అని మండిపడ్డారు.

గురుకులాల్లో ఇప్పటి వరకు 37 మంది విద్యార్థులు చనిపోయారంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాలకు అన్యాయం చేసి మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? వరద కాలవలో నీళ్లు నింపింది ఎవరు? వేలాది ఇల్లు కట్టింది ఎవరు. జగిత్యాల అభివృద్ధి చేసింది ఎవరు? సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాకు చేసిన ఒక మంచి పని చెప్పండి అని అడిగారు.

రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో చేసింది ఏంటంటే.. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డ రైతుబంధుని బంద్ చేసిండు . కేసీఆర్ పండుగకు పంపించే చీరలను బందు చేసిండు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండు. గొల్ల కురుమలకు ఇచ్చే గొర్రె పిల్లలను బంద్ చేసిండు. గంగపుత్రులకు, ముదిరాజులకు ఇచ్చే చేప పిల్లలను బంద్ చేసిండు. రేవంత్ రెడ్డి నువ్వు చేసింది? ఏముంది నువ్వు చేసింది తరాజులో పెట్టి ఎమ్మెల్యేలను కొనడం తప్ప ఏం చేశావు అని ఫైర్ అయ్యారు.