మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంద్రాగస్టులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కురుమూర్తి వెంకటేశ్వరస్వామిపై ఒట్టు పెట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
భూమి, ఆకాశం ఏకమైనా సరే మాట తప్పను అని రైతులకు మాటిచ్చాడు. పూర్తి రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేదు కాబట్టి కురుమూర్తి స్వామి పైన ఒట్టేసి మాట తప్పిన అని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో రేవంత్ రెడ్డి అనుకున్నాను. మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట ఇచ్చి తప్పాడు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలో అమలు చేస్తామని చెప్పి మాట తప్పాడు అని విమర్శించారు.
కనబడ్డ దేవుడు మీద, మసీదు మీద, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. పరిపాలన చేతకాక ఫ్రస్ట్రేషన్లో తిట్ల పురాణం మొదలుపెడతాడు. రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ ప్రసంగంలో 50 సార్లు కేసీఆర్ పేరు జపం చేశాడు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఓటమి భయం మొదలై కేసీఆర్ గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని అన్నారు.
ఈరోజు మహబూబ్‌నగర్ నాయకులతో కలిసి కురుమూర్తి స్వామిని దర్శించుకోవడం జరిగింది. పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతామని రేవంత్ రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకొని క్షమించమని ప్రజలపై ఆగ్రహం చూపొద్దు అని మొక్కడం జరిగింది. రైతులకు రూ. 41 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని, తర్వాత రూ. 31 వేల కోట్లు అన్నారు. బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చేసింది ఎంత అంటే రూ. 17 వేల కోట్లు అని పేర్కొన్నారు.
42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు.ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకోవడానికి నేను సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయడంలో విఫలమయ్యాడు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్షనే అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ గారు ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని. నిన్న వరంగల్ సభలో ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో అని ఆశపడ్డాను. రైతు డిక్లరేషన్ వరంగల్‌లో చేసింది కాంగ్రెస్ పార్టీ. తొమ్మిది రకాల హామీలతో రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టింది. పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్తాడేమో అనుకున్నాము కానీ చెప్పలేదు అని పేర్కొన్నారు.
కేసీఆర్ రూ. 10,000 రైతుబంధు ఇస్తున్నాడు మేము వస్తే రూ. 15,000 ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్‌లో అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి, మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000 ఇస్తానని మోసం చేశారు. రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తానని వారిని మోసం చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్ బిడ్డనని చెప్పుకుంటూ మహబూబ్‌నగర్ పేరును చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. సోనియాగాంధీని దేవత అని తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ సభలో అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అని అన్నాడు. రేవంత్ రెడ్డి అబద్ధాల నోటికి మొక్కాలి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ. ప్రతిపక్షంపై పగ, ప్రజలకు దగా ఇది రేవంత్ రెడ్డి తీరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమీ కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు అని అన్నారు.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రిగా విడుదల చేసిన చివరి రైతుబంధు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రజలు రైతుబంధు కోల్పోయారు.. కేసీఆర్ కిట్ కోల్పోయారు.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కోల్పోయారు.. బతుకమ్మ చీరలు కోల్పోయారు.. దళిత సోదరులు దళిత బంధు కోల్పోయారు.. ముదిరాజ్ బెస్త సోదరులు చేప పిల్లలు కోల్పోయారు అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి వచ్చినంక కొత్త పథకాలు వచ్చాయి. అవి ఏమిటంటే.. రేవంత్ రెడ్డి వచ్చినంక బ్రూ (భట్టి, రేవంత్, ఉత్తమ్) టాక్స్ వచ్చింది. ఫైనల్ డిపార్ట్మెంట్లో బిల్లు రావాలంటే 8% నుండి 15% టాక్స్ వచ్చింది. హైదరాబాద్‌లో ఎవరైనా బిల్డింగ్ కట్టాలంటే స్క్వేర్ ఫీట్‌కు వంద రూపాయల టాక్స్ వచ్చింది అని ఆరోపించారు.
కరోనా వచ్చినప్పుడు మంత్రుల జీతాలు ఎమ్మెల్యే జీతాలు బందు పెట్టి మరి రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. అప్పుడు వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? రేవంత్ రెడ్డి ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ సూట్ కేసులు మోసినప్పుడు మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు పోరాడారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిండు రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు.
10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం. ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోము. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా పోరాటం చేస్తాం అని హరీష్ రావు స్పష్టం చేశారు.
రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి వాగులపై చెక్ డ్యాములు నిర్మించి 24 గంటల కరెంటు ఇచ్చి రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చిన ఏకైక నాయకుడు రైతు సీఎం కేసీఆర్. కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం. వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇస్తానని మోసం.. మహిళలకు రూ. 2,500 ఇస్తానని ఇవ్వకుండా మోసం.. రూ. 15 వేల రైతు భరోసాని ఇవ్వకుండా మోసం. విద్యార్థులకు విద్య భరోసా కార్డ్ ఇస్తానని ఇవ్వకుండా మోసం. ఇందిరమ్మ ఇళ్ళని ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా మోసం. హైడ్రా, మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడం తప్ప ఇళ్ళు కట్టడం తెలియదు రేవంత్ రెడ్డికి. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని ఫైర్ అయ్యారు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారు మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేయడానికి కేసీఆర్ గారు కృషి చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం చివరి దశలో ఉంది. నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేసి మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే శ్రీశైలంలో నీళ్లు సముద్రానికి వెళ్లే పరిస్థితి వచ్చేది కాదు. కేసీఆర్ గారు మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేశారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, పదహారేండ్లు పాలించింది టీడీపీ పార్టీ. ఈ జిల్లాకు తాగునీరు తాగునీరు ఇవ్వని పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి రూ. 4 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కల్వకుర్తి పంప్ హౌస్ దగ్గర పడుకొని మరీ పనులు చేయించాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీ, కోయిల్ సాగర్ కింద దాదాపు 4 వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం అని తెలిపారు.
కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పాలమూరును వలసల జిల్లాగా మారుస్తే. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు పంటలు పండితే ఆ గొప్పతనం మాదని సిగ్గులేకుండా చెప్పుకోవడం కాదు,పంటలు పండడానికి కృషి చేయాలి. చెరువులు బాగు చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల, చెక్ డాములు కట్టడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఈరోజు వ్యవసాయం పండుగగా మారింది. రైతుల సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసింది కేసీఆర్, ప్రాజెక్టును నిర్మించింది కేసీఆర్. 2014లో రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండేది. కెసిఆర్ గారు దిగిపోయిన నాడు కోటి 59 లక్షల మెట్టి టన్నుల వడ్లు పండాయి. 30 లక్షల నుండి కోటి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసిఆర్ గారి కృషి. 66 ఏండ్లు కాంగ్రెస్ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత పంట పండలేదు.. కేసీఆర్ ఘనతను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఒక ప్రాజెక్ట్ అయినా కట్టారా? ఒక చెరువు అయిన తవ్వారా? కనీసం రైతుబంధు అయినా ఇచ్చారా? ఏదీ చేయకుండా పంట ఎలా పెరిగిందని చెప్పుకుంటారు అని అడిగారు.
నిన్న వరంగల్‌లో మహిళల మీటింగ్ పెడితే మహిళలకు ఏదైనా శుభవార్త చెప్తారేమో అనుకున్నారు. మహిళలకు ఏ ఒక్క మంచి పని అయినా మీరు చేశారా? కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి కోసం 11 వేల కోట్లు ఖర్చు చేశారు. పేదింటి ఆడబిడ్డ దవాఖానకు పురుడు కోసం పోతే కెసిఆర్ కిట్ ఇచ్చి 13 వేల రూపాయలు ఇచ్చి ఆటో ఖర్చులిచ్చి ఇంటికి పంపిండు. మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చింది కేసీఆర్. షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించింది కేసీఆర్ అని అన్నారు.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఇస్తానన్న రూ. 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రూ. 3,000 రూపాయలు మహిళలకు ఇస్తామని అక్కడ కూడా తప్పుడు హామీ ఇచ్చి అబద్ధం చెపుతున్నారు. వరంగల్ మీటింగ్‌లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా చెప్పలేదు అని దుయ్యబట్టారు.
కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం. రేవంత్ రెడ్డి కలుపు మొక్క. సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా అడ్డదారుల ముఖ్యమంత్రి అయ్యావు. గెలిచిన తర్వాత పేదలను రైతులను తొక్కుకుంటూ అధికారం అనుభవిస్తున్నావు. రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు వైద్య విద్యను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి కృష్ణా జలాలను మిషన్ భగీరథ ద్వారా అందించింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
వడ్ల కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుతో మాట్లాడినప్పుడు సన్నవడ్లు కొనుగోలు కేంద్రానికి తెచ్చి 25 రోజులు వేచి చూసి బయట తక్కువ రేటుకి అమ్ముకున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం కొర్రీలు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే శాంతమ్మ అనే రైతు సన్నబడ్లను ప్రైవేట్లో అమ్ముకున్నామని చెప్పింది. కృష్ణయ్య అనే రైతు గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు కేంద్రానికి తెస్తే ఇప్పటివరకు కొనలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నెల కింద ఉత్తంకుమార్ రెడ్డి 90 లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొంటాం అని ప్రకటించారు. నిన్న సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహన్ గారు 70 లక్షల ధాన్యం కొంటామని ప్రకటించారు. నెల రోజుల్లో 20 లక్షల వడ్ల దళారుల పాలు అయిందని వారే చెప్పక చెబుతున్నారు అని హరీష్ రావు విమర్శించారు.
పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. అయినా సరే దాన్యమైనా కొంటాడు అనుకుంటే కనీసం దాన్యం కొనే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ పాలనలో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. పత్తి రైతుల నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి కొంటామని చెప్పారు. నిన్నటి వరకు కొన్నది లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే. రూ. 7,520 రూపాయల మద్దతు ధర రావాల్సిన పత్తికి 5 వేలకే అమ్ముకుని పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 350 రోజులు కావస్తుంది మీ 6 గ్యారంటీలు అమలు ఏమైంది? అని ప్రశ్నించారు.
ఆ రాష్ట్ర ఆదాయం తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు. మన నోరు మంచిగుంటే ఊరు మంచిది అన్నట్టు ఈ ప్రభుత్వం చేతకానితనం వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గిపోయాయి. లక్షలాదిమంది రోడ్డు మీద పడే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు విలువ పెరిగి భూమి విలువ పెరిగింది. మూసీ నది మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి ఎక్కువ. ఈ పది నెలల కాలంలో తెలంగాణ 10 సంవత్సరాల వెనుకకు నెట్టేయబడింది. ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్ గారిని గెలిపిస్తారు. మళ్లీ కేసీఆర్ గారు రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వడ్ల కొనుగోలు గురించి ముఖ్యమంత్రి అడగడం లేదు. మద్యం కొనుగోలు గురించి మాత్రమే అడుగుతున్నాడు అని ఎద్దేవా చేశారు.
మద్యం అమ్మకాలకు టార్గెట్ పెట్టి ఎక్సైజ్ అధికారులకు మెమో ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ధాన్యం కొనకపోతే అధికారులకు మెమోలు లేవు. పత్తి కొనుగోలు చేయకపోతే అధికారులకు మెమో లేదు. కానీ మద్యం అమ్మకపోతే అధికారులకు మెమో ఇచ్చాడు. మద్యం పైన పదివేల కోట్లు ఆదాయం రావాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
ఈ జిల్లా మంత్రి జూపల్లి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న. మద్యం అమ్మకం జరగడంలేదని అధికారులకు మేము ఇచ్చారా లేదా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మంచి పరిపాలనను అందించాలని ఆ కురుమూర్తి స్వామిని కోరడం జరిగింది అని తెలిపారు.