నర్సాపూర్ నియోజకవర్గంలోని కుల్చారంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ అందరిని చూస్తే మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి అని అన్నారు.
మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతు రుణమాఫీ చేసేందుకు ఈ రైతు దీక్షను సునీత లక్ష్మారెడ్డి గారు ఏర్పాటు చేశారు. నెల రోజులు దాటిన రైతుల వడ్లను కొనడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అని విమర్శించారు.
పంట చేతికి వచ్చిన రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను చూపేందుకు ఈ రైతు దీక్ష. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎవరు అడగకపోయినా రైతుల కోసం రైతుబంధు పెట్టింది కేసీఆర్. ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి, రైతులకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందించింది కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది మన కేసీఆర్. రైతుల పంటను గింజ లేకుండా కొన్నది మన కేసీఆర్. రైతులకు నీటి తీరువ లేకుండా చేసింది కేసీఆర్. అందుకే కేసీఆర్‌ని రైతుల సీఎం అని కొనియాడారు అని గుర్తు చేశారు.
బూతుల సీఎంగా చరిత్రలో నిలిచాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రైతుల సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతుల సీఎం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. మహిళలకు రూ. 2,500 రూపాయలు ఎగపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రూ. 2 లక్షల రుణమాఫీ రైతులకు చేశారా.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా. రూ. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా అని అడిగారు.
అన్ని హామీలు ఎగపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకోవడం దుర్మార్గం. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి వచ్చినంక గ్యారెంటీకి బాండ్ పేపర్ కు విలువ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ అనే పదానికి విలువ తీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సగం రుణమాఫీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే జరిగింది. డిసెంబర్ 9 అన్నరు కాలేదు, పంద్రాగస్టు కు రుణమాఫీ చేస్తారని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు కాలేదు అని విమర్శించారు.
నిన్న పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర తప్పైన ఒప్పుకుంటాడేమో అనుకున్నా. ఆ దేవుని దగ్గరికి పోయి మళ్లీ ప్రజలను మోసం చేసే విధంగానే ప్రవర్తించాడు. పంద్రాగస్టు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు చేసి పూర్తి రుణమాఫీ చేయకుండా పారిపోయిండు రేవంత్ రెడ్డి. వాయిదాలు మీద వాయిదాలు పెట్టి వాయిదాల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
హరీష్ రావు మూసీ పాదయాత్ర చేయమని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మూసీల ఇండ్లు కూలగొట్టింది ఎక్కడ, నువ్వు పాదయాత్ర చేసింది ఎక్కడ. ఎక్కడైతే మూసీలో ఇల్లు కూలగొట్టావు అక్కడ నుంచి పాదయాత్ర చేద్దాం రా రేవంత్ రెడ్డి. 66 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే మూసీ కాలుష్యం. రూ. 3,800 కోట్లు ఖర్చుపెట్టి మూసీ పునర్జీవం ప్రారంభించారు కేసీఆర్. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో పుణ్యమే నల్గొండ ఫ్లోరోసిస్ అని మండిపడ్డారు.
ఆంధ్ర బాబుల బ్యాగులు మోసిన రేవంత్ రెడ్డికి కేసీఆర్, తెలంగాణ విలువ ఏం తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఎక్కడైతే ఇండ్లు కూగొట్టావో, ఎక్కడైతే ప్రజల కడుపు మంట ఉందో అక్కడ నుంచే మూసీ పాదయాత్ర ప్రారంభిద్దాం అని సవాల్ విసిరారు.
రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎగ్గొట్టినవ్, బతుకమ్మ ఎగ్గొట్టినవ్, కెసిఆర్ కిట్టె ఎగ్గొట్టినవ్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఎగ్గొట్టినవ్. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగవు. రేవంత్ రెడ్డి తిట్లకు ఈ గులాబీ జెండాలు భయపడవు. రేవంత్ రెడ్డి తిట్లు, కేసిఆర్‌ది కిట్లు. కేసీఆర్ రెండుసార్లు రైతుబంధు ఇస్తున్నాడు, మూడుసార్లు రైతుబంధు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న రైతుబంధు ఎగపెట్టిండు రేవంత్ రెడ్డి. మూసీ మురికి కంటే రేవంత్ రెడ్డి మాటలే ఎక్కువ కంపు.. మాటలు కాదు చేతలు చేసి చూపించు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
సినిమాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు.. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఏ సర్టిఫికెట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలివి ఎంత అంటే హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందంట. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంట. దిల్‌సుఖనగర్‌లో విమానాల అమ్ముతరట. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఈ ముఖ్యమంత్రి కి ఏమి రావు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండలో పుట్టిండని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టింది అదిలాబాదులో. ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన అబద్ధాన్ని చెబుతూ ముఖ్యమంత్రి కూర్చి విలువ దిగాజార్చిండు అని దుయ్యబట్టారు.
తెలంగాణలో 30% వడ్లు దళారుల పాలయ్యాయి. ప్రభుత్వం ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని రైతులు దళారులకు రూ. 1700లకు అమ్ముకుంటున్నారు. రూ. 2300 మద్దతు ధర, రూ. 500 బోనస్ కలిపి రూ. 2800 రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కానీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వం వల్ల వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు.మిగిలిన వడ్లనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొని రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వాలి. ఖచ్చితంగా రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి రూ. 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. రైతులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోతే డిప్యూటీ సీఎం మరో ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ వెళ్లారట, ఇంకో మంత్రి సీతక్క కేరళకు వెళ్లారట, మరో మంత్రి శ్రీధర్ బాబు మలేషియాకి వెళ్లారట. మంత్రులు గాలిమోటర్ల జల్సాలు చేస్తుంటే ప్రజలేమో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు గాలి మోటర్‌లో తిరిగి రైతులను ప్రజలను గాలికి వదిలేశారు అని విమర్శించారు.
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇప్పుడు మహారాష్ట్రలోనూ గారడీ గ్యారంటీలు.. కాంగ్రెస్ గారడీల గ్యారెంటీల గురించి తెలిసే హర్యానాలో కాంగ్రెస్‌ను ఓడించారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి వస్తుంది అని జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో రైతుల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని చెప్తున్నారు. మనలాగే మహారాష్ట్ర ప్రజలు మోసపోవద్దంటే మనం కూడా మహారాష్ట్రలో ఉన్న మన బంధువులకు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చెప్పాలి అని అన్నారు.
కలెక్టర్ల కాళ్ళ మీద రైతులు పడే దుస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరపాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అన్నారంట. రుణమాఫీ చేయనందుకు విజయోత్సవమా. రైతుబంధు ఎగ్గొట్టినందుకు విజయోత్సవమా. మహిళలకు రూ. 2,500 ఎగ్గొట్టినందుకు విజయోత్సవమా. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇల్లు కూలగొట్టినందుకు విజయోత్సవమా అని ప్రశ్నించారు.
ఊర్లలో సర్వేకొచ్చినోళ్ళను ఒకటి రాసుకోమనండి. మాకు రుణమాఫీ కాలేదని సర్వేలో రాయించండి మాకు రూ. 4, 000 పెన్షన్ రాలేదని సర్వేల రాయించండి. సంవత్సరం రూ. 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అవ్వ తాతలకు 22 వేల రూపాయల పెన్షన్ బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని సర్వేలో రాయించండి. సర్వే ప్రజల కోసమే కదా ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని హామీలను సర్వేలో రాయించండి అని పేర్కొన్నారు.
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. పోరాడితే పోయేదేమీ లేదు రైతుబంధు వస్తది, రుణమాఫీ జరుగుతది. అధికారంలో అభివృద్ధి చేశాం, ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం అని హరీష్ స్పష్టం చేశారు.
నర్సాపూర్ చిన్న ఘణపూర్ గ్రామంలో సిద్ధ రాములు అనే కాంగ్రెస్ కార్యకర్త, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న అని చెప్పాడు. మొన్న నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో మండల పార్టీ నాయకులు ఏ ఊర్లకు పోయిన ప్రజలు నిలదీస్తున్నారని కార్యకర్తలు వాపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలిచి అధికారంలోకి రాబోతుంది అని అన్నారు.
సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీదనే దాడి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను అన్యాయంగా కేసులు పెట్టిన వేధించిన తస్మాత్ జాగ్రత్త. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారులు, పోలీసులు ఖబడ్దార్.. మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వచ్చేది మా ప్రభుత్వం గుర్తించుకోండి. మా ప్రభుత్వంలో వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు ఏ పరిస్థితి వచ్చిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం అని అన్నారు.
ఘణపురం సొసైటీలో 600 మంది రైతులు ఉంటే ఒకరికి కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ వాగుల దునుకుతాడో చెప్పాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాలం కాలేదని చెరువుల్లో చాప పిల్లలు వదలని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.