mt_logo

మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు: హరీష్ రావు

తుర్కయాంజల్‌లోని జేబీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏటా నిర్విహిస్తున్న ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావు గారికి అభినందనలు అని అన్నారు.

తెలంగాణ అమరవీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుంది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 గా చేసిండు కేసీఆర్ అని పేర్కొన్నారు.

ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపారు. పదేళ్లలో అగ్రస్థానం, రేవంత్ 11 నెలల పాలనలో అధ:పాతాళానికి తీసుకెళ్లాడు అని దుయ్యబట్టారు.

హైదరాబాద్ చుట్టూ ముడు దిక్కుల సముద్రం అంటడు, దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతరు అంటడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట.. ఇట్ల మాట్లాడుతారు రేవంత్ రెడ్డి.సీఎం మాటలు విని పరీక్షల్లో రాస్తే ఆగమైపోతరు. రాష్ట్రం పరువు తీస్తున్నడు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.

గెలిచిన టీం కాదు, ఓడిపోయిన టీం కూడా బాగా ఆడారు.. గెలుపు ఓటములు చాలా సహజం. భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలి. క్రికెట్‌లో హిట్ వికెట్ అవుతారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటయి అని హరీష్ రావు అన్నారు.

ఆరు గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలుపెట్టిండు. 31 ఎస్టీపీలు, రూ. 3800 కోట్లతో మూసీ అభివృద్ధిని కేసీఆర్ ప్రారంభించాడు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను రూ. 1,100 కోట్లతో మూసీలో పోయాలని ప్లాన్ చేశారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడమే రేవంత్ హిట్ వికెట్. మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తేవాలి. అంతేగాని గరీబోళ్ల ఇల్లు కూలగొడుతరా.. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదు అని హెచ్చరించారు.

ఆరు గ్యారెంటీలు అన్నడు మోసం చేసిండు. పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవు. ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్. స్కాలర్షిప్పులు రేవంత్ రెడ్డి గుండు సున్నా చేసాడు. గాడిద గుడ్డు మిగుల్చాడు విద్యార్థులకు.. ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్పుల డబ్బులు ఇవ్వలేదు. డిగ్రీ పాసైన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్‌కు ఇచ్చారు. ఏడాది అవుతున్నది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రేవంత్ అని విమర్శించారు.

ఇది 8% గవర్నమెంట్.. బిల్లులు ఇవ్వాలంటే 8% ఇవ్వాలట. హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామం చేసిండు కేసీఆర్. ఇగురం లేనోడు వ్యవసాయం చస్తే వడ్లు వాగు పాటు, గడ్డి గాలి పాలయ్యిందట.. రేవంత్ రెడ్డి పాలన కూడా అట్లున్నది అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నది. క్రికెట్‌లో 11 మంది లాగే మంత్రులు 11 ఉన్నరు. గూగ్లీ వేస్తున్నాం రేవంత్ ప్రభుత్వానికి..బీఆర్ఎస్ గట్టిగా పోరాటం చేస్తున్నది కాబట్టే పెవిలియన్ దారి పడుతున్నరు. రాబోయే రోజుల్లో మనదే కప్.. కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తడు. మల్లీ వచ్చి బీఆర్ఎస్‌ను గెలిపిస్తాడు అని తెలిపారు.

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా తగ్గించి క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడండి, శారీరక శ్రమ చేయండి. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా తగ్గించి ఆటలు, చదువు మీద దృష్టి పెట్టండి అని హరీష్ రావు సూచించారు.