mt_logo

గ్రూప్స్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరం: హరీష్ రావు

నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి, అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు? 25 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నది అని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపించకపోవడం విద్యార్థులను మోసం చేయడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి అని హరీష్ అడిగారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలి. డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు.