mt_logo

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమవుతున్నది: రేవంత్‌కు హరీష్ రావు లేఖ

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకీ పతనమవుతున్నదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.

లేఖ యధాతధంగా 👇

గౌరవ ముఖ్యమంత్రి గారికి,

విషయం: రాష్ట్రంలో రోజురోజుకీ పతనమవుతున్న విద్యావ్యవస్థ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు- తక్షణ పరిష్కారం గురించి.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందన్న మాటలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ గారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలనే ఆలోచనతో పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించారు.

కానీ 9 నెలల మీ పాలన వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకున్నది. పురుగులు లేని భోజనం కోసం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ఒకవైపు టీచర్లు లేని కారణంగా బడులు మూతబడుతుంటే, మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయి.

మీ ప్రభుత్వ లెక్కలే ఈ వాస్తవాలను చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1864 ఉంటే, 30లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447 ఉన్నాయి. వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 9,609. అంటే మీ 9 నెలల మీ పాలనలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకు గాను దాదాపు 20 వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇక గురుకులాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. కేసీఆర్ గారి పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతి గడించిన గురుకులాలు మీ పాలనలో సమస్యలకు నిలయాలుగా మారాయి. గురుకులాల దుస్థితి గురించి వార్తలు నిత్యకృత్యమైనా మీ ప్రభుత్వానికి పట్టింపులేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో కృషి చేసి పటిష్టపరిచిన గురుకులాలను మీ ప్రభుత్వం 9 నెలల్లోనే ధ్వంసం చేసింది.

సంక్షేమ హాస్టళ్లను, సంక్షోభ హాస్టళ్లుగా మార్చింది. పరిశుభ్రత లోపించి మురుగు, చెత్త చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. పాఠశాల నుంచి కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా ఏ హాస్టల్ చూసినా దుర్బర పరిస్థితులే ఉన్నాయి. కుక్కకాటు, పాముకాటు, ఎలుక కాట్లు తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతి రోజూ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 715 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలు కాగా, 40పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత బాధాకరమైన విషయం ఇది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.

ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల వివరాలను మీకు లేఖ ద్వారా తెలియజేస్తున్నాం. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

🔸ఈ విద్యా సంవత్సరంలోనే దాదాపు 1900 పాఠశాలలు మూతపడ్డాయి. వాటిని తిరిగి ప్రారంభించి పేద విద్యార్థులకు విద్యను చేరువచేయండి.

🔸పదోన్నతులు పొందిన కారణంగా ఏర్పడిన ఖాళీల్లో విద్యా వాలంటీర్లను నియమించి విద్యా బోధన జరిగేలా చూడాలి.

🔸పాఠశాలల్లో పారిశుద్ధ్యం లోపించింది. తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలి.

🔸సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను అటకెక్కించారు. వెంటనే పునః ప్రారంభించి, స్కూల్ డ్రాపౌట్స్ తగ్గించేలా చూడాలి.

🔸మార్చి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే విడుదల చేయాలి. గొడ్డుకారంతో పిల్లలు అన్నం తినే దుస్థితిని మార్చండి.

🔸ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ హాస్టళల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలి.

🔸పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వసతి గృహాల అద్దెలు చెల్లించాలి. వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.

🔸ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గురుకుల పాఠశాల విద్యార్థులకు రావాల్సిన రూ. 62 (కాస్మోటిక్ రూ.50, హెయిర్ కటింగ్ రూ.12) ఇప్పటి వరకు అందలేదు.

🔸కాలేజీ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి నెల అందాల్సిన రూ. 500 పాకెట్ మనీ ఇప్పటి వరకు అందలేదు. వెంటనే చెల్లించాలి.

🔸పాఠశాల వసతి గృహాల్లో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్, జులై, ఆగస్టు నెలల డైట్ చార్జీలు పెండింగ్‌లో ఉండగా, కళాశాల వసతి గృహాలకు సంబంధించి గత 7 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.

🔸వార్డెన్లు అప్పులు తెచ్చి, బంగారాన్ని కుదువ పెట్టి విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. వెంటనే పెండింగ్ డైట్ చార్జీలను చెల్లించాలి. డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు మార్కెట్ రేటుగా అనుగుణంగా పెంచాలి.

🔸ఎస్సీ గురుకుల విద్యార్థులకు నాలుగు జతల స్కూల్ యూనిఫార్మ్స్ ఇప్పటి వరకు అందలేదు. వెంటనే అందించాలి.

🔸వసతి గృహాల్లోని కిటికీలకు దోమలు రాకుండా ఉండేందుకు జాలీలు ఏర్పాటు చేయాలి. చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేసేందుకు గాను సోలార్ పలకల గీజర్లు ఏర్పాటు చేయాలి.

🔸వసతి గృహాల నిర్వహణకు ప్రతి నెల ఇచ్చే పదివేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి.

🔸బీసీ వసతి గృహాలలో నేటి వరకు బెడ్ షీట్స్, కార్పెట్స్ సరఫరా జరుగలేదు. స్కూల్ బ్యాగ్స్, స్వెటర్సు, మంకీ క్యాప్స్, రగ్గులు, రెండు రకాల బూట్లు ఇప్పటి వరకు అందించలేదు. వెంటనే అందించాలని కోరుతున్నాం.