గ్రూప్స్, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం గురించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.
హరీష్ రావు రాసిన లేఖ యధాతధంగా…
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
విషయం: గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు- ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్ల గురించి.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు.
ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నాను. మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదు. మీరు, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యం.
ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుపకంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడిక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికం. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ మీరు నిందారోపణలు చేయడం ఆక్షేపణీయం. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదు. నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరు. పైగా రెచ్చగొట్టినట్లుగా భావిస్తారు. ఉద్యోగ సమస్యల గురించి పోరాటం చేసిన మోతీలాల్ అనే విద్యార్థి, గ్రూప్ 1,2,3 పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తించాలని కోరుతున్నా. నాడు హామీలు ఇచ్చినవారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ, నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారనే విషయాన్ని గుర్తించండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏ చిన్న అవకాశం దొరికినా నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించే వారు. మీరు కూడా నిరుద్యోగుల కోసం అప్పట్లో మౌన దీక్ష కు కూర్చున్న విషయం గుర్తున్నట్లు లేదు.
ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తే మంచిది. ప్రతి అంశాన్ని రాజకీయం కోణంలో చూసే పద్ధతిని విడనాడాలి సూచిస్తున్నా. విద్యార్థులు, నిరుద్యోగులు అశాంతితో ఉన్న రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం అసాధ్యం. మాది ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే మీరు, నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదు. కంచెలు, ఆంక్షలు విధించి వారి గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహ్వానించాలి. సహృదయంతో వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నాను.
లేఖలో హరీష్ రావు చేసిన డిమాండ్స్ 👇🏼
🔸గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నాను.
🔸1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారు.
🔸గ్రూప్ 1 పరీక్ష అనేది యపీపీఎస్ఈ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలలు కన్న గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.
🔸నేడు ఉపముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ భట్టి విక్రమార్క గారు గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం కావటం లేదు.
ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు చేసిన డిమాండ్‌ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు ? గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయండి.
🔸గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
తన్నీరు హరీశ్ రావు
శాసనసభ్యులు, సిద్దిపేట