సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. ఆగష్టు 15 లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేసి, రైతులందరికి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధమని పునరుద్ఘాటించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది రేవంత్ రెడ్డి. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్‌ది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనది.. పదవుల కోసం రేవంత్ పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనది అని గుర్తు చేశారు.
తనకి పదవులు, రాజీనామాలు కొత్త కాదని.. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుంది అంటే ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను అని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపిస్తే.. తాను రాజీనామాకు సిద్ధం.. చేయని పక్షంలో రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు.