mt_logo

గులాబీ జెండా ఉండగా గులాంగిరి చేసేవాళ్ళు ఎందుకు: హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వెంకట్రాం రెడ్డి గారి గెలుపు చాలా ముఖ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏపాటిదో ప్రజలకు అర్థమైంది.. వైఎస్ ఉన్నపుడు ఆరు గంటల కరెంటు ఇస్తే, రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చారు.. సాగునీటి కష్టాలు తొలగించింది కేసీఆర్ అని అన్నారు.

అప్పుడు నిండా ఉన్న జలాశయాలు, ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి. గడ్డిని కూడా నాడు ఆంధ్ర నుండి తెచ్చి పశువులను కాపాడుకున్నం. కేసీఆర్ కాలు పెడితే పదేళ్లు కరువు లేదు.. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు తెచ్చింది. ఏ ఒక్క హామిని కాంగ్రెస్ నెరవేర్చలేదు.. మీరు మాకు ఎంపి సీట్లు ఇస్తే హామీల గురించి నిలదీస్తాం అని స్పష్టం చేశారు.

బీజేపీ వ్యక్తి మనకు నష్టం చేశారు.. ఉప ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అరచేత వైకుంఠం చూపారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతారు. ఎన్నడు జై తెలంగాణ అని వ్యక్తి రేవంత్ రెడ్డి.. అలాంటి వాడు సీఎం. జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడు అని హరీష్ గుర్తు చేశారు.

గోదావరి నీళ్ళు వచ్చి పంటలు పండితే ముద్ద తింటున్నాం.. ఇళ్ళు, ఇళ్ళు తిరిగి వాస్తవాలు చెప్పాలి. నోటి కాడ బుక్క పోగొడుతున్నారు.. నిజమైన రైతు నేస్తం కేసీఆర్.. మోసాలు చేసిన కాంగ్రెస్‌కు ఎలా ఓటు వేస్తారు.. మనం మోసపోవద్దు అని కోరారు.

పేద విద్యార్థుల చదువు కోసం వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అన్నారు.. కార్యకర్తల ఇళ్ళల్ల పెళ్ళిళ్ళు అయితే ఉచిత ఫంక్షన్ హాల్ సేవలు ప్రకటించారు 30 రోజులు కష్ట పడితే ఇద్దరం కలిసి ఇక్కడి ప్రాంత అభివృద్ధి చేస్తాం. క్యాలెండర్‌లకు ఆగం కావద్దు.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నా అని పిలుపునిచ్చారు.

గులాబి జెండా కప్పుకున్న వాళ్ళే ఢిల్లీలో జై తెలంగాణ అంటారు. గులాంగిరి చేసేవాళ్ళు మనకు ఎందుకు అని హరీష్ విమర్శించారు.