mt_logo

గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ తరపున అండగా ఉంటాం: కేటీఆర్ భరోసా

గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేయాలని కోరుతున్న అభ్యర్థుల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

అభ్యర్థులే ఎగ్జామ్‌ను రీషెడ్యూల్ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతోందని ప్రశ్నించారు. ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేయాలంటూ అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయటాన్ని కేటీఆర్ ఖండించారు.

వారిని వెంటనే విడుదల చేయాలని.. వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేయాలంటూ పోరాటం చేస్తున్న అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు.

తమకు అండగా నిలవాలంటూ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు ఎక్స్‌లో కోరటంతో తెలంగాణ భవన్‌లో వారితో కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షంగా గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. వారికి కావాల్సిన న్యాయసాయాన్ని అందిస్తామన్నారు.

ఈ సందర్భంగా ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న మొండి వైఖరిని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని కేటీఆర్‌కు వివరించారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రద్దు చేస్తుందన్నారు. రద్దయ్యే ఎగ్జామ్స్ నిర్వహించటం సరికాదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుందన్నారు.

న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ అభ్యర్థులు తమ ఆవేదనను కేటీఆర్‌కు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా వారికి అండగా ఉంటామని కేటీఆర్ ధైర్యం చెప్పారు. న్యాయపరంగా కావాల్సిన సాయం అందిస్తామన్నారు. అదే విధంగా ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని చెప్పారు.