రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నారు. కాగా.. ఈనెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత ఈనెల 30 తేదీకి మార్చవలసి వచ్చింది.
జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న ఇవ్వాల జిల్లా కలెక్టర్లకు శిక్షణ తరగుతులు నిర్వహిస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29న బక్రీద్ పండుగ కూడా ఉండడం.. వీటన్నింటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30 కి మార్చడం జరిగింది. జూన్ 30 నాడు నూతనంగా నిర్మితమైన ఆసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.