- సీఎం కేసీఆర్ సంకల్పంతో పచ్చబడ్డ పాలమూరు
- మిషన్‌కాకతీయ, కొత్త ప్రాజెక్టులతో జలకళ
- పడావుబడ్డ భూముల్లో పసిడిపంటలు
- వలసలు బంద్..ఉన్న ఊళ్లోనే రాజుల్లా రైతులు
- తెలంగాణలో మారిన మహబూబ్‌నగర్ ముఖచిత్రం
హైదరాబాద్: ఆ రైతు పేరు ఆవుల బాలపీరు. నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని కమ్మారెడ్డిపల్లి స్వగ్రామం. అతడికి ఆరెకరాలున్నది. ఇందులో మూడెకరాలు మెట్ట, మూడెకరాలు తరి. సమైక్యరాష్ట్రంలో ఒక్కపంటకూ పూర్తిగా నీళ్లందేవి కావు. బోర్లు వేసినా లాభం లేదు. దీంతో మూడెకరాల్లో బుడ్డలు మాత్రమే ఏసేటోడు. కన్నీళ్ల సాగు చేసేవాడు. వర్షాలు లేకుంటే భార్య పిల్లలను వదిలి వలసపోయేవాడు. కానీ.. స్వరాష్ట్రంలో కల్వకుర్తి కాలువ నీళ్లు రావడంతో ఆయన పంట పండింది. కాల్వ నీళ్లు ఇడుస్తున్నప్పటి సంది నీటి వూటలు పెరిగినయ్. బోర్ల నీళ్లకు సావులేకుంటైంది. ఇప్పుడు మెట్టనే కాదు పొలం సుత చేస్తున్నడు. రెండుకార్లు పంటలేస్తున్నడు. అంత కేసీఆర్ పుణ్యమే. ఇప్పుడు కూలోళ్లు కూడా వలస పోవుడు బంద్ చేసిన్రు అని ఆనందంగా చెప్తున్నడు. ఇది ఒక్క బాలపీరు కథనే కాదు..మొత్తం పాలమూరు రైతుల బతుకు చిత్రం. సీఎం కేసీఆర్ సంకల్పంతో పచ్చబడ్డ పాలమూరుకు ఇది తార్కాణం.
నీరు ప్రాణకోటికి జీవనాధారం. ప్రతి ఒక్కరికీ నీటిని అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. అక్కడ ప్రతి రెండేండ్లకోసారి కరువు తాండవించేది. వరుసగా ఏ పదేండ్ల రికార్డులను పరిశీలించినా అందులో ఆరేండ్లు కరువు నెలకొన్నట్టు స్పష్టమవుతుంది. ఆ సమయంలో వానకాలం సీజన్‌లో 50 శా తానికి పైగా పంటలు డ్రై స్పెల్స్ వల్ల నష్టపోవాల్సిన దుస్థితి. పత్తిని రెండుసార్లు, మకజొన్నలను నాలుగుసార్లు విత్తుకున్న సందర్భాలు అనేకం. పక్కనే కృష్ణమ్మ.. నాటి పాలకులు ప్రాజెక్టులు కట్టిందీ లేదు.. ఎత్తిపోతలను పూర్తి చేసిందీ లేదు. వర్షపాతం చాలా తక్కువ. నాటి పాలకులు వాన చినుకును ఒడిసిపట్టే వ్యవస్థలను కూడా బలోపేతం చేయలేదు. దీంతో భూగర్భ జలాలపైనే జీవనాధారం. వందల మీటర్లు బోర్లు వేసినా నీళ్లు పడని ప్రాంతాలు అనేకం. యావత్ జిల్లా ఏనాడూ డార్క్ జోన్ దాటి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరువు వ్యతిరేక పోరాటాలు నిత్యకృత్యమైన నేలగా పేరుబడింది. తాగు, సాగునీటికి తీవ్ర కరువు. జిల్లా జనాభాలో మూడోవంతు వలసబాట పట్టిందంటే ప్రధాన కారణమదే. ఏనాడూ పాలమూరులో కరువు శాశ్వత నివారణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చర్యలు తీసుకోలేదు.
స్వరాష్ట్రంలో పాలమూరుకు మంచిరోజులు
సమైక్యరాష్ట్రంలో అరిగోస పడ్డ పాలమూరుకు స్వరాష్ట్రంలో మంచిరోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ దార్శనికత.. బహుముఖ వ్యూహాల అమలుతో కరువు నేలపై జలసవ్వళ్లు వినిపిస్తున్నాయి. భూగర్భ జలాల పెంచే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొలుత మిషన్ కాకతీయ పథకం కింద 2,645 చెరువులను పునరుద్ధరించింది. పూడికలు తీయించింది. తూములు, కాలువలకు మరమ్మతులు చేయించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసింది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేందుకు కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది. మరోవైపు చెరువులు, పలు చెక్‌డ్యామ్‌లను ప్రధాన ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసింది. ప్రాజెక్టుల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లను గత మూడేండ్లుగా నింపుతున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన సమగ్ర చర్యల మూలంగా నీటి సంరక్షణ చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నవి. భూగర్భజలాల స్థాయిని, బోర్‌వెల్‌ల స్థిరత్వాన్ని పెంచడానికి దోహదపడుతున్నాయి.
పాలమూరు ముఖచిత్రమే మారిపోయింది..
పెరిగిన సాగునీటి వసతులతో పాలమూరు ముఖచిత్రమే మారిపోతున్నది. ఒకనాడు కిలోమీటర్ల మేర నెర్రబారిన నేల నేడు పచ్చదనంతో పరవశించిపోతున్నది. ప్రభుత్వం సాగునీటి వసతులను కల్పించడమేగాక అమలు చేస్తున్న ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల వల్ల పాలమూరు రైతులు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే నాడు ఒక్క పంట సాగుకే ఆకాశంవైపు చూస్తూ వెనకాముందు ఆలోచించిన పాలమూరు జిల్లా రైతులు నేడు ఎలాంటి సంకోచం లేకుండా రెండు కార్ల పంటలను తీస్తుండడం నాటికి, నేటికి మారిన పరిస్థితులను చెప్పకనే చెప్తున్నది. కేవలం పత్తి, బుడ్డల సాగుకే పరిమితమైన రైతన్న నేడు తరి పంటలతోపాటు వినూత్న పంటల సాగును కూడా విస్తృతంగా చేపడుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. చెరువుల నుంచి కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు వేసుకొని పసిడి పంటలను పండిస్తున్నారు. డెయిరీ, పౌల్ట్రీ ఫారాలను ఏర్పాటు చేస్తున్న రైతుల సంఖ్య కూడా రోజురోజుకూ ఆ జిల్లాలో పెరుగుతున్నది. కరువుతో అల్లాడిన అదే నేల ఇప్పుడు కాయగూరలను పెద్ద ఎత్తున పండిస్తూ ఎనో పట్టణాలకు ఎగుమతి చేస్తుండటం మారిన పరిస్థితులకు దర్పణం పడుతున్నది. ఫలితంగా పాలమూరు జిల్లా లో ఇప్పుడు స్వల్పకాలిక వలసలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
భూగర్భ జలమట్టం పైపైకి..
-తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 83.3% విస్తీర్ణంలో (2,211 చదరపు కిలోమీటర్ల) భూగర్భజలాల లభ్యత 10 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉండేది.
-అందులో 8.3% ప్రాంతం పూర్తిగా రెడ్‌జోన్‌లో ఉండేది. అక్కడ 20 మీటర్లకు మించిన లోతులో భూగర్భ జలాలు ఉండేవి. మరో 16.8శాతం ప్రాంతంలో 15 నుంచి 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలతో ఆరెంజ్‌జోన్‌లో ఉండేది.
-ప్రస్తుతం మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ప్రాజెక్టులతో అనుసంధానం ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
-డార్క్‌జోన్ లేదా ఆరెంజ్‌జోన్ లేనేలేదు. భూగర్భ జలమట్టం 7.56 మీటర్లుగా నమోదవడం విశేషం.
-చెక్‌డ్యామ్‌లు 30 వేలకు పైగా ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీరందిస్తున్నాయి.