- ఇప్పుడున్న సిబ్బందికి రెండు రెట్లు అదనంగా ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులతో తన కార్యకలాపాలను విస్తరించనున్న కంపెనీ
- అదనంగా 2000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న సంస్థ
- అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్ మెన్ శాక్స్ తెలంగాణలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుతో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్ సీఈవో డేవిడ్ ఎం సోలమన్ బృందంతో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు తన ప్రకటనను వెలువరించింది. గోల్డ్ మెన్ శాక్స్ సంస్థ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈరోజు సంస్థ ప్రకటించిన తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా ప్రస్తుతం ఉన్న 1000 ని మరో రెండు రెట్లు పెంచి 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనుంది. ఇందుకోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని/విస్తరణను చేపట్టనున్నది.
సంస్థ బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్ మెన్ శాక్స్ సంస్థ కార్యకలాపాల బలోపేతం కోసం ఈ నూతన కేంద్రం పనిచేయనున్నది. తమ సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లోనూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్ మెన్ శాక్స్ సంస్థ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల ఈకో సిస్టం బలంగా ఉన్నదని, దీనికి అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక పూరిత విధానాలు, హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణం వలన తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సీఈవో డేవిడ్ ఎం. సోలోమన్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో తమ నూతన కార్యాలయం, తమ ఇన్నోవేషన్ లక్ష్యాలకు, కార్యకలాపాలకు అనుగుణంగా పని చేస్తుందని తెలిపారు. 2021 జూలై నెల నుంచి హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ, అప్పటి నుంచి వేగంగా తన విస్తరణ ప్రణాళికలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తూ వస్తుంది. అయితే గత పది సంవత్సరాలలో హైదరాబాద్ నగరం సాధించిన అద్భుతమైన ప్రగతి, ముఖ్యంగా పెట్టుబడుల అంశంలో సాధించిన పరిశ్రమ స్నేహపూర్వక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తమ విస్తరణ చేస్తున్నట్లు సంస్థ ఈ రోజు ప్రకటించింది.
ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ కార్యాలయం సంస్థాగతంగా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నదని సంస్థ చైర్మన్ ప్రశంసించారు. ఈ విస్తరణతో హైదరాబాద్ నగరంలో తమ సంస్థ సిబ్బంది మొత్తం మూడు రెట్లు అవుతుందన్నారు