
- హైదరాబాద్ నగరంలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన జీహెచ్ఎక్స్ (GHX) సంస్థ
గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్‌చేంజ్ (GHX) సంస్థ హైదరాబాద్ నగరంలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ నగరంలో హెల్త్ కేర్ రంగానికి అద్భుతమైన అనుకూల వాతావరణం ఉందని ముఖ్యంగా మానవ వనరులతో పాటు ఈ రంగానికి సంబంధించిన అనేక సంస్థల సమ్మిళిత ఈకో సిస్టం ఉందని సంస్థ తెలిపింది.
ఈరోజు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్ నగరంలో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం సంస్థ తన విస్తరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించింది. హెల్త్ కేర్ రంగం పూర్తిగా డిజిటల్ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఇందులో భాగంగా హెల్త్ కేర్ కంపెనీలు పెద్ద ఎత్తున డిజిటలీకరణ, ఐటీ ఆధారిత సేవల పైన విస్తృతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జీహెచ్ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిజే సింగ్ తెలిపారు.
ఈ దిశలోనే హైదరాబాద్ లో తమ విస్తరణ ప్రణాళికలు, గ్లోబల్ కెపబిలిటీ కేంద్రం ద్వారా సంస్థ లక్ష్యాలను అందుకుంటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీహెచ్ఎక్స్ సంస్థ 2025 నాటికి తన ప్రస్తుత కార్యకలాపాలను మూడింతలు చేసే లక్ష్యంతో తన విస్తరణ ప్రణాళికలను చేపడుతుందని సంస్థ బృందం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కేంద్రంగా ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్ కార్యకలాపాలను విస్తరిస్తామని, తమ సంస్థ ఇన్నోవేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ విస్తరణ ఉంటుందని సంస్థ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం సందర్భంగా తెలియజేశారు.
హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మానవ వనరులు,హెల్త్ కేర్ మరియు ఐటీ రంగాలకు సంబంధించిన అద్భుతమైన ఈకో సిస్టం అందుబాటులో ఉన్న నేపథ్యంలో అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు నగరంలో తమ హెల్త్ కేర్ ఆదారిత టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఒకవైపు హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగానికి చేయూతను అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఆలోచనలను బలోపేతం చేసే దిశగా జీహెచ్ఎక్స్ సంస్థ తన విస్తరణ ప్రణాళికలను హైదరాబాద్ కేంద్రంగా ప్రణాళిక ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.