mt_logo

ఆజాద్ అబద్ధాలు!

By దేవులపల్లి ప్రభాకరరావు

ఇటీవల హైదరాబాద్ వచ్చి, తెలంగాణ గడ్డపై అడుగుపెట్టి పచ్చి అబద్ధాలు తప్ప ఇంకేమీ మాట్లాడని ఇద్దరు జాతీయస్థాయి పెద్ద మనుషుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ రెండవ వాడు. మొదటాయన బీజేపీజాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గతంలో, కొన్నినెలల కిందట రెండు పర్యాయాలు వచ్చి, రెండు పర్యాయాలూ అమిత్‌జీ చర్విత చర్వణం వలె మొదటి అబద్ధాన్నే మళ్లీ చెప్పారు, దోహ్రాయించారు. నాజీ నియంత హిట్లర్ కుడి భజం, అబద్ధాలు చెప్పడంలో, విరామం లేకుండా వాటిని ప్రచారం చేయడంలో అఖండుడు అయిన గోబెల్స్‌కు ఆయన వారసుడో, మానస పుత్రుడో అయి ఉంటాడు.

పార్టీలో పదవులు దొరుకగానే ఏదో ఒక సాకుతో ద్రోహం (సాబొటేజ్) చేసే దుష్ట పాత్రను కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో నడిరాత్రి నిమజ్జనం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నట్టేట ముంచిన కుటిల, కుత్సిత చరిత్ర కాంగ్రెసోళ్లది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు సంఖ్యల సత్యాలను వివరిస్తూ మూతోడ్ జవాబివ్వడంతో అమిత్ జీ ఆ సంగతి ఎత్తడం లేదు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం గత నాలుగేండ్లలో తెలంగాణకు ఇచ్చింది తక్కువ, ఇవ్వవలసింది ఎంతో ఎక్కువ. ఇచ్చిందైనా తెలంగాణ ప్రజల హక్కుగా వచ్చిందే గానీ, ఎవరి మెహర్బానీ కాదు. తెలంగాణను తమ అరువై ఏండ్ల పోరాటాలు, త్యాగాలతో, విడువని పట్టుతో సాధించుకున్నది తెలంగాణ ప్రజలు, ఎవరో దయతలచి ఇచ్చింది కాదు. దేశ రాజకీయాల్లో పాలకపక్షం బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికి కాలు దువ్వుతున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ (స్వాతంత్య్రానంతరం ఇక భారత జాతీయ కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ చెప్పినా, ఆయన మాట వినకుండా జీవచ్ఛవంగా కొనసాగుతున్న పార్టీ) నేతలు అబద్ధాలు చెప్పడంలో కూడా తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ రాఫెల్ రచ్చను పురస్కరించుకొని హైదరాబాద్ వచ్చారు. ఇష్టమైన వారికి బిర్యానీ ప్లేట్లతో హైదరాబాద్ నగరం అందరికీ స్వాగతం పలుకుతుంది. నాలుగు వందల ఏండ్ల కిందట మొగల్ పాదుషా ఔరంగజేబు హైదరాబాద్ నేలపై ఆరు నెలలు మకామ్ పెట్టినా న్యాయమార్గంలో ఏమీ సాధించలేక పలాయన మంత్రం పఠించాడు. ఇప్పుడు ఢిల్లీ నుంచి అబద్ధాల మూటలతో లేక సూట్‌కేసులతో వస్తున్న నేతలకూ ఔరంగజేబు గతే పట్టకతప్పదు. రాఫెల్ రొంపిని పక్కనబెట్టి, ఆజాద్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడాడు, అన్నీ పచ్చి అబద్ధాలు, వక్రభాష్యాలు, ఆత్మవంచన. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఆజాద్‌కు, తర్వాత దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియంది కాదు. తెలిసి నప్పటికీ యదార్థాలకు మసిబూసి మారేడుకాయ చేయడం మరింత ఘోరం. ఆజాద్ అబద్ధాలు కొత్తవి కావు. ఒకవంక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం గాంధేయమార్గంలో మహత్తర పోరాటం జరుపుతుండగా మరోవంక కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతూ ఆజాద్ ఆడిన అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు. తెలంగాణ సమస్యపై తమ హైకమాండ్ నెలరోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్ ఓసారి అన్నాడు. నెలరోజులైనా నిర్ణయం రాలేదు. నిర్ణయం ఏమైందనడిగితే నెల రోజులంటే నెల రోజులా అని ఎదురు ప్రశ్న వేసిన ఘనుడు ఆజాద్. ఆజాద్‌తో పోటీపడుతూ నాటి దేశ వ్యవహారాల మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఆడిన అబద్ధం అబద్ధాల చరిత్రలో ఉన్నత శిఖరం. 122 ఏండ్ల కిందట ప్రారంభమైన ఒలింపిక్ క్రీడల్లో ఇంతవరకు అబద్ధాలాటను చేర్చలేదు. చేర్చితే, అమిత్ షాను వెనుకకు నెట్టి, కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ నిశ్చయంగా స్వర్ణపతకం గెలిచేవాడు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కు ఎటువంటి పాత్ర లేదని అబద్ధాలాడి ఆజాద్ తన అజ్ఞానాన్ని, విజ్ఞతా రాహిత్యాన్ని బిడియం లేకుండా ప్రదర్శించాడని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, మధ్యయుగం నాటిది కాదు, ఇటీవలిదే ఈ చరిత్ర. ఈ చరిత్రను, తమ పోరాట పటిమ చరిత్రను, ఈ చరిత్రలో కాంగ్రెస్ నాయకుల దుష్టపాత్రను, విదూషక వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరు. హైదరాబాద్ వచ్చి, తెలంగాణ ఉద్యమంపై విపరీత వ్యాఖ్యలు చేసి, తమ వెకిలితనాన్ని ప్రదర్శించడానికి కూడా కాంగ్రెస్ అగ్రనేతలు వెనుకాడలేదు. హైదరాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభ జరుగుతున్న సందర్భాన ఒక నాయకుడు, అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలు నిర్వహించిన పెద్ద మనిషి వెంటనే ఇవ్వడానికి తెలంగాణ ఇన్‌స్టంట్ కాఫీ కాదు అంటూ వెకిలి నవ్వు నవ్వాడు తనకుతానే చాలా తెలివిగల వ్యాఖ్య చేశానని సంబురపడుతూ. మరో కాంగ్రెస్ అగ్ర నాయకుడు (అందరూ అగ్ర నాయకులే, నాయకులే! లీడర్లే గానీ క్యాడర్ లేని పార్టీ అది) ఇవ్వడానికి తెలంగాణ దోశ కాదన్నాడు. వెటకార, వ్యంగ్య వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని కించపరిచి, తెలంగాణ ప్రజల గుండె గాయాలపై గుంటూరు, బెజవాడ, ఆంధ్ర కారం చల్లి హరో హరో అనిపించిన ఘనులు ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడటం, అదీ అందరికీ తెలిసిన నిజాలే అబద్ధాలుగా చెప్పడం విచిత్రం. 32 ఏండ్ల సుదీర్ఘకాలం భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలకు, భారత జాతీయ కాంగ్రెస్ కు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన గాంధీజీకి 150 ఏండ్లు నిండబోతున్న సమయంలోనైనా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ఆడటం మానేసి, నిజం చెప్పడం ప్రారంభిస్తే ఆ మహాత్ముని ఆత్మకు కొంతవరకు శాంతి కలుగుతుందేమో.

నిజానికి తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం గురించి, అరువై ఏండ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి తెలియనివారు బహుశా ప్రపంచం లో, ముఖ్యంగా ఈ దేశంలోని ప్రజాస్వామ్యవాదుల్లో ఎవ్వరూ ఉండరు. తెలిసినా, చారిత్రక వాస్తవాలను మరుగుపరిచి అబద్ధాలు చెప్పుతున్నవారు కాంగ్రెస్ నేతలొక్కరే. ఆసఫ్‌జాహీ రాచరికవ్యవస్థలో 220 ఏం డ్లు నలిగిన హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో 1956 నవంబర్‌లో నిరంకుశంగా విలీనం చేసింది ఇక్కడి, అక్కడి (కేంద్రంలోని) కాంగ్రెస్ ప్రభుత్వాలే. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని చెప్పుకు తిరిగిన కాంగ్రెస్ మహా నాయకులే అరువై ఏండ్ల ఆంధ్ర పాలనలో, ఆంధ్ర పెత్తనంలో, అణిచివేతలో, దోపిడీలో తెలంగాణ మానవ వనరులకు, ప్రకృతి వనరులకు, తెలంగాణలో ప్రజాస్వామ్యానికి, తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు, సారస్వతానికి ఎంతటి నష్టం వాటిల్లిందో ఇక్కడి, అక్కడి కాంగ్రెస్ నేతలు ఎన్నడైనా ఆలోచించారా, పరిశీలించారా, పరిశోధించారా, సమీక్షించారా? ఇవన్నీ జరిగింది ఒక్క కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే. ఈ సత్యాన్ని గుర్తించి అంగీకరించడానికి కాంగ్రెస్ నేతలకు పుట్టెడు భయం, తెలంగాణ ప్రజల ముందుకెళ్లి చెంపలు వేసుకోవలసి వస్తుందని, ముక్కు నేలకు రాయవలసి వస్తుందని కాంగ్రెస్ నాయకుల కంపరం. గాంధీజీ 32 ఏండ్లు భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు భవిష్యత్ భారతం గురించి ఎక్కువగా ఆలోచించారు, బ్రిటిష్ పాలనను అంతంచేసి రాజకీయ స్వాతం త్య్రం సాధించడంతో కర్తవ్యం పూర్తికాదని, స్వాతంత్య్ర పోరాట కార్యక్రమం ముగియబోదని ఆయన భావించారు. ఒకవంక స్వాతంత్య్ర ఉద్యమాలు కొనసాగిస్తూ గాంధీజీ భవిష్యత్ భారత ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సర్వతోముఖ వికాసం కోసం నిర్మాణ కార్యక్రమాలను రూపొందించి వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ భారతానికి గాంధీజీ కార్యక్రమాల్లో ప్రథమ స్థానం లభించింది. 14 ఏండ్ల ఉద్యమకాలంలో, అనంతరం గత నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ గాంధీపథంలో నడిచారు. భవిష్యత్ తెలంగాణ భవ్యరూపకల్పన కోసం ఆలోచన జరిపారు. ఆంధ్ర పాలన అంతమై, స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు సంక్రమించనున్న జటిల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ మేధోమథనం కావించారు. గాంధేయ సిద్ధాంతాలు, సూత్రాలకు, విధానాలకు ఎన్నడో తిలోదకాలిచ్చిన గాంధీజీ రాజకీయ వారసులకు ఇది తలవంపుల పరిస్థితి. తన తర్వాత తన రాజకీయ వారసులుగా ఊరేగేవారు తన సిద్ధాంతాలకు తిలోదకాలు విడుస్తారని గాంధీజీకి తెలుసు కనుకనే కాంగ్రెస్ పార్టీకి తాళంవేసి సర్వ సేవా సంఘ్ ను స్థాపించాలని సలహా ఇచ్చారు. పదవులు, అధికారం కోసం తహతహలాడిన ఆయన రాజకీయ వారసులు ఈ సలహాను అవహేళన చేసి విస్మరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర శూన్యం అంటే అతిశయోక్తి కాదు. నిజాం రాచరిక పాలనకు, మతోన్మాదుల అమానుష చర్యలకు, అరాజకత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు, స్త్రీలు, పురుషులు అన్న తేడా లేకుండా పోరాటం జరుపుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు సరిహద్దులకు ఆవల ఆంధ్ర ప్రాంతంలో శిబిరాలు నడిపి విశ్రమించారు. ఇది వారు చెప్పుతున్న సంగతే. ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ, ఎవరు, ఏ అమాయకులు జెండా ఎత్తినా అక్కడ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్ నేతల హస్తం కనిపించింది తమ పార్టీలో పదవుల కోసం ఒత్తిడులు తెచ్చి బేరసారాలు చేయడానికి. పార్టీలో పదవులు దొరుకగానే ఏదో ఒక సాకుతో ద్రోహం (సాబొటేజ్) చేసే దుష్ట పాత్రను కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో నడిరాత్రి నిమజ్జనం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నట్టేట ముంచిన కుటిల, కుత్సిత చరిత్ర కాంగ్రెసోళ్లది. ఇక తెలంగాణ రాష్ట్రం రావడం కల్ల అన్న నిస్పృహ, నిరాశ తెలంగాణ ప్రజలను చేతన రహితులను చేసినప్పుడు కేసీఆర్ వజ్ర సంకల్పంతో అవతరించిన విమోచనశక్తి టీఆర్‌ఎస్. మూడేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ ప్రజల మహత్తర శక్తిగా ఎదిగి, అప్పటికి జీవచ్ఛవంగా, నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిచ్చింది ఈ శక్తి. ఆజాద్ తదితర నేతలు ఎన్ని అబద్ధాలాడినా, ఇది చారిత్రక సత్యం. తెలంగాణ ప్రజల గుండెలో చెరగని సత్యం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *