mt_logo

రేవంత్ ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నాడు: బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్

మనుషులు చనిపోవాలని కోరుకునే రేవంత్ లాంటి సీఎం దేశంలో మరెవ్వరూ లేరు. రేవంత్ ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు బీఆర్ఎస్వీ మద్దతు ఇచ్చింది. డీఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడుగు పెట్టలేదు. రేవంత్ రెడ్డి పాలనలో ఓయూలో పోలీసులు దమనకాండను సృష్టించారు అని పేర్కొన్నారు. సిలబస్ మారడంతో డీఎస్సీని రద్దు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 11 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ఎట్లా అవుతుంది.. కనీసం 20 వేల ఉద్యోగాలతో డీఎస్సీని నిర్వహించాలి అని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులను పోలీసులు చిత్రహింసలు పెట్టారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని ఉద్యోగాలను అమ్ముకున్నారు. తెలంగాణలో వసూలు చేయాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని విమర్శించారు.

నిరుద్యోగులను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని అశోక్ నగర్ వద్దకు
తీసుకురాలేదా. కేటీఆర్, హరీష్ రావు దీక్ష చేసి చనిపోవాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీలో అన్నారు అని కిషోర్ కుమార్ ఎద్దేవా చేశారు.

నీట్ విద్యార్థుల కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడలేదా.. రాహుల్ గాంధీ దీక్ష చేసి చనిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా. కోదండరాం ఎక్కడికి వెళ్లారు.. ఎమ్మెల్సీ పదవి కోసం నోరు విప్పడం లేదు. సీఎం బిజీగా ఉన్నారని కోదండరాం అంటున్నారు అని అన్నారు.

రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు టైం ఇవ్వక పోవడంతో అసహనంలో ఉన్నారు.. మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం తెలంగాణ నుండి ఢిల్లీకి కప్పం పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు.. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు అని ధ్వజమెత్తారు.

పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు డబ్బులు వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. కోచింగ్ సెంటర్ నడిపిన రియాజ్‌కు గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు అని అడిగారు. గ్రూప్ 1కు 1:100 నిష్పత్తిలో పిలవాలని అసెంబ్లీలో భట్టి మాట్లాడలేదా.. భట్టి, రేవంత్ ముక్కు నేలకు రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి అని పేర్కొన్నారు.

పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఈ మధ్య పచ్చ నేతతో కలిసిన తర్వాత రేవంత్ పచ్చ కామెర్లు ముదిరాయి.. అధికారంలోకి రాగానే లంకె బిందెల కోసం వెతికారు.. ప్రభుత్వం దగ్గర లంకె బిందెలు ఉంటాయా. పొరపాటున ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు అని ఫైర్ అయ్యారు.

నీట్ కోసం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ దీక్షకు కూర్చోవాలి. దీక్ష చేసి రేవంత్ చస్తే తెలంగాణకు పీడ వదులుతుంది అని మేము కూడా అనొచ్చు. నిరుద్యోగులు స్వచ్చంధంగా ఆందోళన చేస్తున్నారు. మేము బాధ్యత గల ప్రతిపక్షంగా సంఘీభావం తెలుపుతున్నాం. పోస్టుల సంఖ్య పెంచిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలి అని కిషోర్ కుమార్ కోరారు.