mt_logo

మినీ టెక్స్ టైల్ పార్క్ కు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

  • త్వ‌ర‌లోనే కొడ‌కండ్ల మినీ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాప‌న‌
  • సిరిసిల్ల మోడ‌ల్ లో త్వ‌ర‌లో గ్రౌండింగ్‌కు ఏర్పాట్లు
  • సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

హైద‌రాబాద్‌:  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు, మంత్రి కేటీఆర్ స‌హ‌కారంతో పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గం కొడ‌కండ్ల‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ మినీ టెక్స్ టైల్ పార్క్ కు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. సిరిసిల్ల మోడ‌ల్ లో గ్రౌండింగ్ కు ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత శాఖ‌ల అధికారుల‌ను  ఆదేశించారు. ఈ మేర‌కు మంత్రి టిఎస్ ఐఐసీ ఎండి ఈవీ న‌ర్సింహారెడ్డి, టెక్స్ టైల్స్ ఇండ‌స్ట్రీస్ డైరెక్ట‌ర్ మిహిద్‌, టెక్స్ టైల్స్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వెంక‌టేశం, కొడ‌కండ్ల స‌ర్పంచ్‌ ప‌సునూరి మ‌ధుసూద‌న్‌, సిందె రామోజీ, త‌దిత‌రుల‌తో హైద‌రాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని త‌న పేషీలో  మంత్రి గురువారం స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికులు కొడ‌కండ్ల చుట్టు ముట్టు ప్రాంతాల్లో అధికంగా ఉండి, ముంబై, భీవండి, సూర‌త్ వంటి ప్రాంతాల‌కు వ‌ల‌స పోతున్నార‌న్నారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత అన్ని రంగాల్లో వ‌చ్చిన అభివృద్ధి, మార్పుల మాదిరిగానే, చేనేత రంగంలోనూ మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుక‌నుగుణంగా ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్  దృష్టికి తీసుకెళ్ళిన వెంట‌నే కొడ‌కండ్ల‌లో మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు అనుమ‌తిచ్చార‌ని, అలాగే మంత్రి కేటీఆర్ సైతం స‌హ‌క‌రించార‌ని చెప్పారు. దీంతో అన్ని ర‌కాల అనుమ‌తులు వ‌చ్చి, భూ సేక‌ర‌ణ కూడా పూర్త‌యింద‌న్నారు. అయితే, నిర్ణీత స్థ‌లంలో సిరిసిల్ల మోడ‌ల్ లో పార్క్ ఏర్పాటు చేస్తే, అందుబాటులో ఉండే కార్మికుల‌కు వాటిని సాధ్య‌మైనంత త‌క్కువ మొత్తానికి కేటాయించి, ఉపాధి అవ‌కాశాల‌ను మెరుగు ప‌ర‌చాలని నిర్ణ‌యించామ‌న్నారు. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని, ఆయా శాఖ‌ల అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. మొద‌టి ద‌శ ప‌నుల‌ను సెప్టెంబ‌ర్ లోగా పూర్తి చేయాల‌ని చెప్పారు.