mt_logo

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. 10% పెరిగిన పోలింగ్

రాష్ట్రంలో ఆదివారం రెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ లో పాల్గొనేందుకు విద్యావంతులు భారీగా తరలివచ్చారు. ఆరు జిల్లాల్లో కలిపి 5,77,454 మంది పట్టభద్రులు ఉండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో 38శాతం, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాల్లో 53.1 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10.93 శాతం పోలింగ్ అధికంగా నమోదయ్యిందని అధికారులు చెప్పారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కన్నా ఇక్కడ 11 శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందని, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 15 శాతం అధికంగా ఓటింగ్ జరిగిందని చెప్పారు. 2,81,136 మంది ఓటర్లు ఉండగా, 53.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే తాను విజయం సాధిస్తానని పల్లా పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ తొమ్మిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకుపోయారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నాయని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు మొదలైన వారంతా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. ఈనెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నగరంలోని చాదర్ ఘాట్ ఇసామియా బజార్ విక్టోరియా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *