mt_logo

మృగశిర కార్తె సందర్భంగా  పండగలా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జూన్ 8,9,10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాలలో మృగశిర కార్తె సందర్బంగా నిర్వహించనున్న ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా నూతనంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. 

ఈ సందర్బంగా మంత్రి ఆయన ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన  ఫిష్ ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం ఉపాది పొందే విధంగా అన్ని జిల్లాలకు చెందిన మహిళా మత్స్యకారులకు చేపల తో వివిధ రకాల వంటకాల తయారీ పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారి భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్ లో 20 నుండి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తుల తో కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రి వర్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను  నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్ర లకు కూడా భాగస్వాములను చేయాలని అన్నారు. అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని, మత్స్యకారులు నిరంతరం చేపల వేటను కొనసాగిస్తూ జీవనోపాధిని పొందుతున్నారని అన్నారు. నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు.