mt_logo

అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూసేటోళ్లను తరిమి కొట్టాలి  

  • పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలి
  • రైతులంతా ఓకే కులం.. పార్టీలతో రైతులకు సంబంధం ఉండదు
  • కేసీఆర్ ఇచ్చే నీళ్లు,కరెంట్ ఒక్క బీఆర్ఎస్ రైతుల పొలాల్లోకే పోవు కదా..?
  • అభివృద్ధి మా వంతు… ఓటుతో ఆశీర్వదించడం మీ వంతు

మోర్తాడ్: అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం లో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టే బి.టి రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. 2.90 కోట్లతో తక్కురూ వాడ నుండి కుకునూర్ లింక్ వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు మోర్తాడ్ పెద్దవాగు రోడ్డు పై శంకుస్థాపన, 6.80 కోట్ల వ్యయంతో మోర్తాడ్ నుండి బషీరాబాద్ వయా వడ్యాట్ బీటీ రోడ్ డబుల్ లైన్ పనులకు మోర్తాడ్ మార్కెట్ వద్ద, వడ్యాట్ గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులను,ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. మోర్తాడ్ ప్రాంత రైతులకు ప్యాకేజీ 21 ద్వారా ప్రతి 3 ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి, మిషన్ భగీరథ లాగా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చినట్టు వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వర్షాలు రాకున్నా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ రైతు బంధు,రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్,కరువు కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు ఇస్తూ..  రైతులకు భరోసాగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో రైతులకు హాని తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలి

కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాడు, మేమొస్తే 3 గంటల కరెంట్ ఇస్తానని కాంగ్రెస్ వాళ్లు అన్యాయంగా,దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పూట 3 గంటల కరెంట్ ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు. 

రైతులంతా ఓకే కులం..పార్టీలతో రైతులకు సంబంధం ఉండదు

అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతులంతా ఒకే కులం..పార్టీలతో రైతులకు సంబంధం ఉండదన్నారు.సీఎం కేసీఆర్..పార్టీలకు,కులాలకు,రాజకీయాలకు అతీతంగా రైతులను అక్కున చేర్చుకున్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చే నీళ్లు,కరెంట్ ఒక్క బీఆర్ఎస్ రైతుల పొలాల్లోకే పోవు కదా..రైతులందరి ప్రయోజనాల కోసమే ఆలోచించే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. మంచి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా రైతులు,ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. అభివృద్ధి చేయడం మా వంతు…మాకు బలాన్ని చేకూరుస్తూ ఓటుతో ఆశీర్వదించడం మీ వంతు అని ప్రజలను విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలని మంత్రి కోరారు.