
తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని, ఉచిత కరెంట్‌కు ఆద్యులం తామేనని, పింఛన్లు పెంచుతామని ఇక్కడ ఊదరగొడుతున్న కాంగ్రెస్… ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక ప్రజలను అష్టకష్టాలపాలు చేస్తున్నది. వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో కనీసం ఏడు గంటల కరెంట్ ఇవ్వలేక అన్నదాతలను కష్టాల్లోకి నెడుతున్నది. హస్తం పార్టీ నేతల అసమర్థతతో కర్ణాటక, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల్లో ప్రజలు నిత్యం కరెంట్ కోతలతో అల్లాడుతున్నారు. రోజులో 6-7 గంటలు పవర్ కట్ చేస్తుండడంతో వ్యవసాయంతోపాటు విద్యుత్తు ఆధారిత రంగాలన్నీ కుదేలవుతున్నాయి. కాంగ్రెస్ అసమర్థ పాలనపై తాజాగా రాజస్థాన్‌లో అన్నదాతలు రోడ్డెక్కారు. వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేయాలని, లో వోల్టేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమండ్ చేశారు. జోధ్‌పూర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్) వద్ద ఐదురోజులనుంచి అన్నదాతలు ఆందోళన చేస్తున్నా అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రోజులో ఏడు గంటలు విద్యుత్తు కోతలు విధించడంతో నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని మొత్తుకున్నా కాంగ్రెస్ నాయకుల గుండెలు కరుగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ రైతుల ఆందోళనలకు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కూడా తన మద్దతు తెలియజేసింది. రైతుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.
వెలుగుల తెలంగాణలో కాంగ్రెస్ చీకట్లు అవసరమా?
రాజస్థాన్‌లోనే కాదు.. ఇటీవల కాంగ్రెస్ గద్దెనెక్కిన కర్ణాటకలోనూ నిత్యం కరెంట్ కోతలే. దేశానికే ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో రోజులో 6-7 గంటల పవర్ కట్ ఉందంటే కాంగ్రెస్ పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు కరెంట్ కోతలను 4 గంటలకు పరిమితం చేస్తామని చెప్పిన హస్తం నాయకులు.. మూడు నెలలు గడిచినా కరెంట్ సమస్య తీర్చలేకపోతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ విజన్‌తో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ కేవలం ఆరు నెలల్లోనే వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ అందజేశారు. వీటితోపాటు గృహాలకూ కన్నుకొట్టినంతసేపుకూడా పోకుండా కరెంట్ సరఫరా అవుతున్నది. లోవోల్టేజీ సమస్యలు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అన్న ముచ్చటే వినిపించడం లేదు. మరి ఇలాంటి వెలుగుజిలుగుల తెలంగాణలో కాంగ్రెస్ చీకట్లను స్వాగతిద్దామా? కాంగ్రెస్ నమ్మి అంధకారంలోకి వెళ్లిపోదామా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.