mt_logo

కాళేశ్వ‌రంపై అబ‌ద్ధ‌పు లెక్క‌లు.. బ‌డా జుమ్లా పార్టీ అని మ‌రోసారి నిరూపించుకొన్న బీజేపీ!

బీజేపీ అంటే బ‌డా జుమ్లా పార్టీ. ఇదివ‌ర‌కే నిస్సిగ్గుగా కేసీఆర్ కిట్‌లో ఆరు వేలు మాయే అంటూ బొంకి ప‌రువు తీసుకొన్న‌ది. తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌థ‌కంలో త‌మ వాటా ఉందంటూ ఆ పార్టీ నాయ‌కులు అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు. మందికి పుట్టిన బిడ్డ‌ల‌ను మా బిడ్డ‌ల‌ని ముద్దాడుతున్నారు. కేంద్రం చిల్లిగ‌వ్వ ఇవ్వ‌కున్నా ప్ర‌తి ప‌థ‌కానికి ఢిల్లీనుంచి నిధులు వ‌స్తున్నాయ‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. మ‌రి తెలంగాణలాంటి ప‌థ‌కాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవంటే మాత్రం స‌మాధానం ఉండ‌దు. తాజాగా,  తెలంగాణ వ‌రప్ర‌దాయ‌నిలా మారిన‌ కాళేశ్వ‌రం ప్రాజెక్టుపైనా పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ అబ‌ద్ధాలు వ‌ల్లెవేసింది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చింద‌ని ఆ పార్టీ ఎంపీ నిండు స‌భ‌లో నిస్సిగ్గు వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై యావ‌త్తు తెలంగాణ స‌మాజం మండిప‌డుతున్న‌ది. 

పార్ల‌మెంట్ సాక్షిగా ప‌చ్చిబొంకులు!

ప‌సిగుడ్డు తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ప్రోత్సహించాల్సిన కేంద్ర స‌ర్కారు.. ఏ ఒక్క ప‌థ‌కానికి న‌యాపైసా విదిల్చ‌లేదు. పైగా తెలంగాణ ప్ర‌గ‌తిలో త‌మ పాత్ర ఉందంటూ ప్ర‌తిసారి క్లెయిమ్ చేసుకొంటున్న‌ది. తెలంగాణ స‌ర్కారు ప్రాధేయ‌ప‌డినా యావ‌త్తు రాష్ట్ర సాగునీటిగోస తీర్చే కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌లేదు. రూపాయి నిధులు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో తెలంగాణ స‌ర్కారు త‌న సొంత ఖ‌ర్చుల‌తో ప్రాజెక్టును పూర్తిచేసి, రాష్ట్రంలో మూడు పంట‌ల‌కు సాగునీరు అందిస్తున్న‌ది. కాగా, తెలంగాణ రాష్ట్రానికి నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార‌సు చేసినా కేంద్రంనుంచి నిధులు రాలేద‌ని తాజాగా లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ప‌క్ష‌నేత నామా నాగేశ్వ‌రావు వ్యాఖ్యానించారు. కేంద్ర స‌ర్కారు ద్వంద్వ‌నీతిని ఎండ‌గ‌ట్టారు. దీనికి ప్ర‌తిగా జార్ఖండ్ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్ర స‌ర్కారు రూ.86వేల కోట్లు ఇచ్చింద‌ని తెలిపారు. నామా ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌నకు దిగారు. దూబే అస‌త్య‌పు లెక్క‌ల‌తో స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించుకున్నారని 2021 జూలై 22న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ లోక్‌సభలోనే ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేశారు. గతేడాది జూలై 31, డిసెంబర్‌ 15న కూడా కేంద్రం ఇదేమాట స్పష్టంచేసింద‌ని వెల్ల‌డించారు. అదే బీజేపీ ఇప్పుడు కాళేశ్వ‌రంపై కారుకూత‌లు కూస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. బీజేపీ త‌ప్పుడు లెక్క‌ల‌పై బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తోపాటు తెలంగాణ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇక‌నైనా త‌ప్పుడు లెక్క‌లు మాని తెలంగాణ‌కు రావాల్సిన నిధులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.