స్వరాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య కరెంటు. పొద్దున ఓ మూడు గంటలు.. రాత్రి ఓ నాలుగు గంటలు… 24 గంటల్లో మొత్తంగా కరెంటు ఉండేది ఏడు గంటలు మాత్రమే.. లో వోల్టేజీతో కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు..అన్నదాతల కరెంటు కష్టాలు నిత్యకృత్యం. ఇక పవర్ కట్‌లతో పరిశ్రమలు మూతపడి పారిశ్రామికరంగం కుదేలు.. ఉపాధి లేక కార్మికుల అష్టకష్టాలు.. అచ్చంగా ఇప్పుడు ఇదే పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నది. ఈ మండుటెండల్లో అనేక రాష్ట్రాలు విద్యుత్తు కోతలతో అల్లాడుతున్నాయి. గొప్పగా చెప్పుకొనే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లు..వందేండ్ల చరిత్ర కలిగిన పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో చీకట్లు అలుముకొన్నాయి. కానీ దేశంలోనే 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అనతికాలంలోనే చీకట్లను తరిమికొట్టంది. పవర్‌హాలిడేలకే హాలిడేలిచ్చింది.
నిరంతరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత విద్యుత్తు సంకల్పంతో దేశ ముఖచిత్రంలోనే తెలంగాణ వెలుగులీనుతున్నది.
దేశంలో కరెంటే గోస.. రాష్ట్రంలో విద్యుత్తు విజయం
దేశంలోని ఏ రాష్ట్రం తీసుకొన్నా కరెంటు గోసలే కనిపిస్తున్నాయి. ఇటీవల ఒడిశాలోని బర్గాఢ్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులకు టార్చ్‌లైట్ల వెలుగులోనే అక్కడి వైద్యులు చికిత్స అందించడం అన్ని పత్రికల్లో వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పవర్ కట్స్ విధించడంతో నిద్ర కూడా పట్టట్లేదని ఒడిశావాసులు వాపోతున్నారు. మయూర్‌భంజ్ జిల్లా బరిపడలోని రామచంద్ర భంజదేవ్ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా 9 నిమిషాల పాటు విద్యుత్తు నిలిచిపోయింది. దీంతో టార్చిలైట్ వెలుతురులోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి సొంతూరు దుండూర్సాహిలో మొన్నటి వరకు విద్యుత్తు సౌకర్యమే లేదు. ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారనగా.. ఆగమేఘాల మీద ఆ కుగ్రామానికి విద్యుత్తు లైన్లు వేశారు. ఇక సాఫ్ట్‌వేర్ హబ్‌గా పిలిచే బెంగళూరులో తరుచూ పవర్ కట్స్ ఏర్పడుతున్నాయి. కరెంటు కోతలతో విసిగివేసారిన పారిశ్రామికవేత్తలు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కాం) అధికారులకు హారతి పట్టి నిరసన తెలియజేయడం నిరుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యుత్తు కోతలతో వస్తువులను ఉత్పత్తి చేయడం తమకు సాధ్యం కావట్లేదంటూ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, రామ్‌గఢ్‌తో పాటు పలు జిల్లాల్లోని చిన్న, మధ్యస్థ పరిశ్రమల ప్రతినిధులు జార్ఖండ్ ప్రభుత్వానికి మొర పెట్టుకొంటున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై, పుణెలోని సాఫ్ట్‌వేర్, ఉత్పాదక కంపెనీలు ఉన్న చోట్ల కూడా కరెంటు కోతలు పెరిగిపోయాయి. దీంతో పుణెలో గత గురువారం 12 గంటల్లోనే రూ.350 కోట్ల నష్టం వచ్చినట్టు పరిశ్రమ నిపుణులు తెలిపారు. బీజేపీ గొప్పగా చెప్పుకొనే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న యూపీలోని లక్నో, ఘజియాబాద్ తదితర జిల్లాల్లో విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో విద్యుత్తు కోతలు పెరిగిపోయాయి. మధ్యప్రదేశ్‌లో రెండు రోజులకొకసారి పవర్ కట్స్ ఉంటున్నట్టు ప్రజలు వాపోతున్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్‌తో పాటు పలు పారిశ్రామిక వాడల్లో పవర్ కట్స్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కిందటేడాది పరిశ్రమలకు వారానికి ఒకరోజు విద్యుత్తు కోత విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ ప్రకటించడం తెలిసిందే. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు గంటలపాటు విద్యుత్తు కోతలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విద్యుత్తు కోతలతో దేశంలోని కనీసం 85 శాతం ఇండ్లు ప్రభావితం అవుతున్నాయి. రోజులో 2-8 గంటలపాటు విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 37 శాతం మంది వెల్లడించారు. ఈ మేరకు లోకల్‌సర్కిల్స్ తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లోని 25 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఇదిలా ఉండే.. దేశంలోని ఒక్క తెలంగాణలోనే 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా అవుతున్నది. దేశంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,255 యూనిట్లు ఉండగా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 2,166 యూనిట్లుగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే ఇది 73 శాతం ఎక్కువ.
వెలుగుజిలుగుల తెలంగాణ
విద్యుత్తు స్థాపిత సామర్థ్యం, తలసరి వినియోగం, సరఫరా, మిగులు విద్యుత్తు తదితర అంశాలను దేశప్రగతికి కొలమానంగా భావిస్తారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్తును సరఫరా చేస్తున్నామా? లేదా? అన్న దానిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పటం లేదు. దేశంలో ఏచోట చూసినా ప్రస్తుతం విద్యుత్తు కష్టాలే. అయితే, సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలే తప్ప వెలుగులు చూడని తెలంగాణ బిడ్డలకు.. ఇప్పుడు ప్రతిరోజూ దీపావళిగానే మారింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో కరెంటు కోతలు లేని రాష్ట్రంగానే కాదు.. మిగులు విద్యుత్తు, తలసరి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులు సృష్టిస్తున్నది.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మచీకట్లే రాజ్యమేలేవి. హైదరాబాద్‌లో రోజూ 2-4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలపాటు విద్యుత్తు కోతలు ఉండేవి. వ్యవసాయానికి 3-4 గంటలపాటు కరెంటు ఇచ్చేవారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు. రాష్ట్రంలో మొత్తం డిమాండ్‌లో 2,700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా బయటపడేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించింది. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి కోతలు లేకుండా చేశారు. సంస్థల అంతర్గత విద్యుత్తు సామర్థ్యం పెంపు, కొత్త విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు. వెరసి రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేసి చరిత్ర సృష్టించారు. కొద్దికాలంలోనే వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును ఇచ్చి రికార్డు నెలకొల్పారు.