mt_logo

తెలంగాణ‌లో విద్యా విప్ల‌వం.. విద్యావకాశాల కల్పనలో జాతీయ‌స్థాయిలో తెలంగాణ టాప్‌.. 

-బెస్ట్‌ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ‌కు గుర్తింపు

-లక్ష మంది విద్యార్థులకు అత్యధిక కాలేజీలు

-టాప్‌-30లో మన కళాశాలలకు చోటు

స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజ‌న్‌తో విద్యా విప్ల‌వం వ‌చ్చింది. గురుకులాలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌తోపాటు ఇంజినీరింగ్‌, మెడిసిన్, ఫార్మా, ఆర్కిటెక్చ‌ర్‌, ఫైన్ ఆర్ట్స్ ఇలా అన్ని ర‌కాల కళాశాల‌లు విద్యార్థుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఫ‌లితంగా విద్యావకాశాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. లక్ష మంది విద్యార్థులకు అత్యధిక కళాశాలలున్న ద్వితీయ రాష్ట్రంగా గుర్తింపు పొందడమే గాకుండా, ఉత్తమ కళాశాలలున్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది. దేశంలో టాప్‌ -30 బెస్ట్‌ కాలేజీల్లోనూ మన రాష్ర్టానికి చెందిన వివిధ కాలేజీలు చోటుదక్కించుకున్నాయి. ఆసక్తికరంగా ఉన్న ఈ విషయాలు ఇండియా టుడే- ఎంబీఆర్‌ఏ బెస్ట్‌ కాలేజీస్‌ సర్వే -2023లో వెలుగుచూశాయి.

ప్ర‌తి ల‌క్ష‌మందికి 53 కాలేజీలు

కర్ణాటక రాష్ట్రంలో ప్రతి లక్ష మంది విద్యార్థుల (18-23 ఏండ్లున్న)కు 62 కాలేజీలు ఉండగా, తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు 53 కాలేజీలున్నాయి. కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఫార్మా, ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ సహా ఎన్నో ప్రత్యేక కోర్సులు గల కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు పాఠశాల విద్యకే పరిమితమైన గురుకులాలను దశలవారీగా కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేస్తున్నది. దీంతో పెద్ద ఎత్తున కాలేజీలు అందుబాటులోకి వచ్చి, విద్యా వసతులు పెరుగుతున్నాయి. ఇలా ఆసక్తి ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్రం రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నది. అన్నిరకాల చదువులు లభించే ఎడ్యుకేషన్‌ హబ్‌గా తెలంగాణ నిలుస్తున్నది.

టాప్‌ -30 బెస్ట్‌ కాలేజీల్లో మ‌న విద్యాసంస్థ‌లు

జాతీయస్థాయిలో ఉత్తమ కళాశాలల వివరాలను ది ఇండియా టుడే సర్వే ప్రకటించింది. వివిధ విభాగాల్లో టాప్‌ -30 బెస్ట్‌ కాలేజీల్లో మన హైదరాబాద్‌కు చెందిన పలు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. ఇంజినీరింగ్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, బీబీఏ, బీసీఏ, మెడికల్‌, లా కోర్సులున్న బెస్ట్‌ కాలేజీలను ఇండియా టుడే తన సర్వేలో వెల్లడించింది. వాటిల్లో హైదరాబాద్‌ నుంచి ఒక్కోటి చొప్పున ఇంజినీరింగ్‌, కామర్స్‌, మెడికల్‌, లా కాలేజీల చొప్పున బెస్ట్‌ కాలేజీల జాబితాలో నిలువడం విశేషం.