అధ్యక్షుడి మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ కలహాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మూడు వర్గాలుగా విడిపోయి..ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలతో పార్టీ పరువును రోడ్డుకీడ్చారు. వీరికి ఇప్పుడు సీనియర్ నాయకురాలు విజయశాంతి తోడయ్యారు. తాజాగా, కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన సభనుంచి విజయశాంతి అర్ధంతరంగా వెళ్లిపోయి పార్టీలో అసహనాన్ని వ్యక్తంచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలంగాణ వ్యతిరేకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని వేదికపై చూడలేకే వెళ్లిపోయానని వాపోయారు. ఈ అంశం తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారమే లేపింది. దీనిపై విస్తృత చర్చ మొదలయ్యింది. ఇటీవల నిర్వహించిన ధర్నాల్లోనూ ఆమె పాల్గొనలేదు. మునుగోడు ఎన్నికలప్పుడూ పార్టీలో సీనియర్‌నైన తన సేవలను వాడుకోవడం లేదని అధ్యక్షుడు బండి సంజయ్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పటికే చాలామందికి టికెట్లు కేటాయించారని, కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించారని తనను మాత్రం పట్టించుకోవడం లేదని విజయశాంతి కోపంతో ఊగిపోతున్నట్టు సమాచారం. త్వరలో ఆమె బీజేపీని వీడినున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది.
బండి ఢిల్లీ పర్యటనపై ఈటల వర్గాల్లో గుబులు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని పక్కకు పెట్టడంతో ఈటల రాజేందర్ హస్తం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఈటల వర్గంపై బండి వర్గం గుర్రుగా ఉన్నది. బండి పదవి పోవడంతో ఈటల వర్గం సంబురాల్లో మునిగితేలినట్టు సమాచారం. అయితే, బండి సంజయ్ తాజా పర్యటన ఈటల వర్గంలో గుబులు రేపుతున్నది. కేంద్రమంత్రి అమిత్‌షాను సోమవారం బండి సంజయ్ కలిసి, చాలాసేపు మాట్లాడారు. దీంతో బండికి కీలక బాధ్యతలు ఏవైనా అప్పజెప్పుతారేమోనని ఈటల రాజేందర్‌తోపాటు ఆయన వర్గం కలవరపడుతున్నట్టు చర్చ నడుస్తున్నది. కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార సభలో ప్రకాశ్ జవదేకర్ పదేపదే బండి పేరును ప్రస్తావించడంపైనా ఈటల వర్గం అసహనంతో ఉన్నది. బండి సంజయ్‌ను కేవలం ఓదార్చేందుకే పిలిపించుకొన్నారని, కీలక పదవి ఏమీ ఇవ్వట్లేదని ఇప్పటికే ప్రచారం కూడా మొదలెట్టింది. బండి సంజయ్ ఢిల్లీ పర్యటనతో మళ్లీ ఈటల వర్సెస్ బండిగా పరిస్థితి మారుతుందని టీ బీజేపీ నేతలు ఆందోళనచెందుతున్నారు. ఇప్పటికే పార్టీ రోడ్డునపడ్డదని, మళ్లీ ఆ పరిస్థితి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని అంతర్మథనం చెందుతున్నారు.