mt_logo

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇందుకు ఈ ఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో అవరోధాలను దాటుకుని .. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి  కేసీఆర్ చేపట్టిన ఈ ఆకాశమంత సంకల్పం వాస్తవరూపం దాల్చుతున్నది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను సాధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్‌ కమిటీ)  కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేసింది.  ఇక అనుమతులు రావడమే ఆలస్యం. 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఒక దశలో ఈఏసీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పిస్తూనే ఉంది. గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరపున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం.