mt_logo

మాదాసి కురువలకు కూడా గొర్రెల పంపిణీ : మంత్రి తలసాని

గొర్రెల పెంపకం వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం జోగులాంబ గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మొహన్ రెడ్డి, అబ్రహం ఆధ్వర్యంలో మాదాసి కురువ లు ఆదర్శ నగర్ లోని MLA సముదాయంలో మంత్రిని కలిసి తమకు కూడా సబ్సిడీ గొర్రెల యూనిట్లను అందజేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల వృత్తిని మరింత ప్రోత్సహించాలి, వారి అభివృద్ధికి చేయూతను అందించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించిందని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల్, ఆలంపూర్, కొల్హాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అర్హులైన మాదాసి కురువలు అందరికి సబ్సిడీ గొర్రెల యూనిట్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, లబ్దిదారులు తమ వాటాధనం DD లను అధికారులకు అందజేయాలని చెప్పారు.

ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను అందజేయాలని ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను సక్రమంగా పెంచుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలలో అర్హులైన లబ్దిదారులలో 50 శాతం మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ పథకం ప్రారంభం లోనే మాదాసి కురువ లకు కూడా గొర్రెల యూనిట్లను అందజేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కొందరు నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మోసపూరిత మాయమాటలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించి మీ అభివృద్దిని అడ్డుకొనే ప్రయత్నం చేశారని  అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంతోషాన్ని కోరుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో మనకు పొరుగునే ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు తమకు ఇలాంటి పథకాలు అమలుకావడం లేదని ఎంతో ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.