ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఓ కల. గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే అది నెరవేరని స్వప్నం. చాలీ చాలని వేతనంతో నెట్టుకొచ్చే నిరుపేదలు అటు ఇంటి అద్దెకే సగం డబ్బులు వెచ్చిస్తూ.. మిగతావాటితో కష్టాల కాపురం చేస్తుంటారు. ఇల్లు కాదు కదా.. కనీసం గజం స్థలం కొనలేని నిస్సహాయత ఎన్నో కుటుంబాలది. అలాంటివారి కలను తెలంగాణ సర్కారు నిజం చేస్తున్నది. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.30-40 లక్షల విలువ ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిరుపేదలకు అందజేసి, వారి కలను నెరవేరుస్తున్నది. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గ్రేటర్‌లో లక్ష ఇండ్లను కట్టి పంచితీరుతామని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 70వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో 24 నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2న (శనివారం) ఒక్కరోజే 11,700 ఇండ్లను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి పక్షపాతం, రాజకీయానికి చోటులేకుండా లాటరీ పద్ధతిద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసి, మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, శాసన సభ డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా అందజేయనున్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ వివరాలు
-బండ్లగూడలో 270 గృహాలను నిర్మించారు. వీటిని చాంద్రాయణగుట్ట నియోజకవర్గ లబ్ధిదారులకు కేటాయించారు. ఫారూఖ్‌నగర్‌లో 770 గృహాలను బహదూర్‌పుర నియోజకవర్గ లబ్ధిదారులకు కేటాయించారు. వీటిని లబ్ధిదారులకు హోంమంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు.
-కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో 1700 ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు.
-నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇండ్లను పంపిణీ చేస్తారు.
-నల్లగండ్లలో 216 గృహాలతోపాటు సాయినగర్ హఫీజ్‌పేటలోని 168 ఇండ్ల పట్టాలనను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు అందజేస్తారు.
-పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్‌పూర్-2లో 3,300 నిర్మించారు. వీటిని మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేస్తారు.
-మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో అత్యద్భుతంగా 1,500 ఇండ్లను నిర్మించారు. వీటిని మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేస్తారు.
-ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నిర్మించిన 500 గృహాలను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ చేతులమీదుగా అందజేస్తారు.
-మేడ్చల్ పరిధిలోని ప్రతాప్‌సింగారంలో వెయ్యి ఇండ్లను లబ్ధిదారులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు అందజేయనున్నారు.