- ప్రభుత్వ దవాఖాన డెలివరీల్లో
- దేశంలోనే తెలంగాణ టాప్
- 69% ప్రసవాలు అక్కడే
- సీఎం కేసీఆర్ సంకల్పంతో
- తెలంగాణలో వైద్య విప్లవం
హైదరాబాద్: గతంలో భార్యను అత్తింటివారు ప్రభుత్వ దవాఖానకు పంపితే ఆ భర్త మండిపడేవాడు.. తల్లీబిడ్డను సంపుతరా? అంటూ గాయిగాయి చేసేటోడు.. ప్రైవేట్‌కే తీసుకుపోవాలని అత్తగారిని పట్టుబట్టేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తన భార్యను ప్రభుత్వ దవాఖానకే తీసుకుపోండి అని అల్లుడు అత్తమామలకు చెప్తున్నడు. అక్కడే నార్మల్ డెలివరీ అయితదని నమ్ముతున్నడు. మీదికెళ్లి పైసలు అత్తయ్.. అత్తమామకు ఆసరైతయని ప్రభుత్వ దవాఖానకే మొగ్గుచూపుతున్నడు. ఇదంతా సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే సాధ్యమైంది. కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణలో వైద్య విప్లవం వచ్చింది. నాడు 30 శాతం మాత్రమే డెలివరీలు జరిగే ప్రభుత్వ దవాఖానల్లో నేడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. పేదలు, అభాగ్యులకు పైసా ఖర్చులేకుండా వైద్యం అందుతున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. సిబ్బంది ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 69% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. సంగారెడ్డి జిల్లా 87% ప్రభుత్వ దవాఖానల ప్రసవాలతో కొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు నమోదయ్యాయి. సంగారెడ్డితోపాటు నారాయణపేట జిల్లాలో 83%, మెదక్‌లో 82%, జోగులాంబ గద్వాలలో 81% మంది గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే సురక్షితంగా ప్రసవాలు చేయించుకున్నారు. వైద్యసిబ్బంది మొత్తం కుటుంబసభ్యుల మాదిరిగా ఆత్మీయ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి వాహనాలు వంటి పథకాల ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది. ఇదే సమయంలో అత్యాధునిక వసతులతో దవాఖానలను బలోపేతం చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి.
అనూహ్యంగా పెరిగిన ప్రసవాలు
2014లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతమే ఉండేవి. ప్రతి వంద మంది గర్భిణుల్లో 30 మంది ప్రభుత్వ దవాఖానకు వస్తే.. 70 మంది ప్రైవేట్‌కు వెళ్లేవారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రాష్ట్రంలోని ప్రతి వంద మంది గర్భిణుల్లో 69 మంది పురుడు కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. 31 మంది మాత్రమే ప్రైవేట్‌ను ఆశ్రయించారు. 16 జిల్లాల్లో ప్రభుత్వ దవాఖాన ప్రసవాలు 70 శాతానికిపైగా నమోదు కావడం విశేషం. రాజధాని హైదరాబాద్‌లో గల్లీకో ప్రైవేట్ దవాఖాన ఆకర్షిస్తున్నా.. 77% మంది గర్భిణులు ప్రభుత్వ దవాఖానపై నమ్మకం ప్రదర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 70% మంది ప్రభుత్వ దవాఖానలకే వెళ్లారు. నగరీకరణ అధికంగా ఉన్న సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు కూడా 70% క్యాటగిరీలో ఉండటం విశేషం.
సీఎం కేసీఆర్ సంకల్పానికి ఫలితం
సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన అంశాల్లో మాతాశిశు సంరక్షణ ఒకటి. అప్పట్లో మాతృమరణాల రేటు (ఎంఎంఆర్) 92, శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 39గా ఉండేది. ఈ దుస్థితిని మార్చాలనే లక్ష్యంతో తొలుత కేసీఆర్ కిట్ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంతో బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలు ఆర్థిక సాయం అందుతున్నది. కచ్చితంగా నాలుగుసార్లు ఏఎన్సీ చెకప్ జరుగుతున్నది. అమ్మ ఒడి వాహనాల ద్వారా సురక్షిత ప్రయాణం, ఆరోగ్యలక్ష్మి ద్వారా పోషకాహారం, రక్తహీనత నివారణకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తున్నది. టిఫా స్కానింగ్ యంత్రాల ద్వారా బిడ్డ ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. మరోవైపు దవాఖానల్లో లేబర్‌రూంల ఆధునికీకరణ, ఎంసీహెచ్‌ల ఏర్పాటు, గైనకాలజిస్టులకు శిక్షణ, ప్రోత్సాహకాలు అమలవుతున్నాయి. ఇవన్నీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. తొమ్మిదేండ్లలోనే 70% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడమే ఇందుకు నిదర్శనం.
సీఎం కేసీఆర్ విజన్‌కు నిదర్శనం
మాతాశిశు సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ గొప్ప విజన్, ఆయన మార్గనిర్దేశనంలో అమలు చేసిన కార్యక్రమాల ఫలితమే ఇది. 2014లో 30% ఉన్న ప్రభుత్వ దవాఖాన ప్రసవాలు 2022-23 నాటికి 62 శాతానికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 69% ప్రసవాలతో తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలోనే అత్యధిక ప్రభుత్వ దవాఖాన ప్రసవాలతో కొత్త చరిత్రను లిఖించింది. నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా, ఏకంగా 16 జిల్లాల్లో 70 శాతానికిపైగా ప్రసవాలు జరగడం హర్షనీయం.